Sunday, December 22, 2024

నిర్లక్ష్యంతో మృత్యు ఒడిలోకి…

- Advertisement -
- Advertisement -

Pillion rider without helmet in accidents

హెల్మెట్ పెట్టుకోని పిలియన్ రైడర్… నిర్లక్ష్యంతో మృత్యువాత
సైబరాబాద్‌లో వరుసగా సంఘటనలు… కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు
ఆరు నెలల్లో 2,54,408 కేసులు నమోదు

హైదరాబాద్: మోటార్‌ వాహనాలపై వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో చాలామంది పిలియన్ రైడర్లు మృత్యువాతపడుతున్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మహిళలు మృతిచెందారు. పేట్‌బషీరాబాద్, మేడ్చెల్, బాచుపల్లి, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మహిళలు మృతి చెందారు. వారిలో ఒక్కరూ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. బైక్ నడిపేవారు, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత కొంత కాలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వెనుక కూర్చున్న వారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ అమలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో పిలియన్ రైడర్ హెల్మెట్ పెట్టుకోని వారికి జరిమానా వేస్తున్నారు.

ఈ సంఘటనల్లో వెనుక నుంచి వచ్చిన భారీ వాహనాలు ఢీకొట్టడంతో బైక్‌పై వెనుక కూర్చున్న వారు కిందపడడంతో తలపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో కేసులో భారీ వాహనాన్ని ఓవర్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడడంతో తలపగిలి మృతిచెందారు. నార్సింగి ట్రా ఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్‌సిటీ వద్ద బైక్‌పై భార్యభర్త వెళ్తుండగా ఆర్టిసి బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో భర్త గాయాలతో బయటపడగా భార్య హెల్మెట్ పెట్టుకోకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ కేసుల్లో వెనుక కూర్చున్న వారు మృతిచెందగా మోటార్ సైకిల్‌ను నడుపుతున్న వారు మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డారు. బాచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువతి కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందింది. పిలియన్ రైడర్లు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో సైబరాబాద్ పోలీసులు 2022 జనవరి నుంచి జూన్ వరకు 2,54,408 కేసులు నమోదు చేశారు.

నాలుగేళ్లు దాటితే…
మోటార్ సైకిల్‌పై వెళ్లే ఇద్దరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నాలుగేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ బైక్ వెనుక కూర్చుంటే తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం ఇది తప్పనిసరని పోలీసులు తెలిపారు. అలాగే చాలామంది బైక్‌లకు ఉన్న సైడ్ మిర్రర్‌లను తీసివేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనించేందుకు తప్పనిసరిగా సైడ్ మిర్రర్‌లు ఉండాలని తెలిపారు. చాలామంది మోటార్ సైకిలిస్టులకు సైడ్ మిర్రర్ లేకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తలేరని, దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ప్రామాణిక హెల్టెట్లు వాడాలి : పోలీసులు
మోటార్ సైకిల్ దారులు తప్పనిసరిగా ప్రా మాణికమైన హెల్మెట్‌ను వాడాలని పోలీసులు తెలిపారు. వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని కోరారు. బైక్‌లకు రెండు సైడ్‌లకు మిర్రర్‌లు ఫిక్స్ చేసుకోవాలని అన్నారు. మిర్రర్‌లు లేకపోవడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులు బైక్ నడుపుతున్న వారే హె ల్మెట్ పెట్టుకోవాలని, వెనుక కూర్చున్న వారు పెట్టుకోనవసరం లేదన్నట్లుగా వ్యవహారిస్తున్నారని పోలీసులు తెలిపారు. వాహనదారులు నిర్లక్షంగా వ్యవహరించడం వల్లే తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని కోరారు. పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యహరిస్తున్నామని, జరిమానా విధిస్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News