న్యూఢిల్లీ : పినాకా ఎక్స్‌టెండెడ్ రేంజ్ ( పినాకా ఈఆర్) రాకెట్ ను పోక్రాన్ ఫీల్డ్ రేంజ్‌లో శనివారం విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డివొ) వెల్లడించింది. ఇదివరకటి పినాకా రాకెట్లకు ఇది అభివృద్ధి రూపాంతర వ్యవస్థ. డిఆర్‌డివొ, డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ లేబొరేటరీ, పుణె కేంద్రంగా గల హైఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి లేబొరేటరీ సంయుక్తంగా ఈ పినాకా ఈఆర్ వ్యవస్థను రూపొందించాయి. గత మూడు రోజుల నుంచి దశల వారీగా ఈ పరీక్షలు జరిగాయని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. వివిధ రకాల సామర్ధం ఉన్న వార్‌హెడ్స్‌తో పినాకా రాకెట్లను పరీక్షించామని, అన్ని ట్రయల్స్ లోను సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు వివరించింది. పినాకా ఎంకే ఐ రాకెట్ వ్యవస్థ సుమారు 40 కిమీ దూరంలో ఉన్న టార్గెను ధ్వంసం చేయగలదు. పినాకా2 వేరియంట్ 60 కిమీ దూరంలో ఉన్న టార్గెట్‌ను చిత్తు చేయగలదు. అయితే పినాకాఈఆర్ రేంజ్ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్లపై 24 రాకెట్లను పరీక్షించినట్టు తెలిపారు.