తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. మామగారు ముఖ్యమంత్రి, అల్లుడు ఎమ్మెల్యేగా త్వరలో కేరళ అసెంబ్లీలో కనిపించనున్నారు. ఆ మామగారు మరెవరో కాదు..77 ఏళ్ల పినరయి విజయన్. ముఖ్యమంత్రిగా రెండవ పర్యాయం అధికారాన్ని త్వరలో చేపట్టనున్నారు. ఆయన అల్లుడు, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పిఎ మొహమ్మద్ రియాస్ తొలిసారి అసెంబ్లీలో కాలుపెడుతున్నారు. బెంగళూరులో ఐటి కంపెనీని నిర్వహిస్తున్న విజయన్ కుమార్తె వీణ భర్తే రియాస్.
కన్నూర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ధర్మదం నుంచి 50 వేలకు పైగా మెజారిటీతో విజయన్ గెలుపొందారు. ఆయన అల్లుడు(44) రియాస్ కోజిక్కోడ్ జిల్లాలోని వామపక్షాల కంచుకోట బేపోర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వారసత్వంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతల కుమారులు, కుమార్తెలు అసెంబ్లీకి ఎన్నిక కావడం గతంలో చూసినప్పటికీ మామగారు, అల్లుడు ఒకే అసెంబ్లీలో దర్శనమివ్వడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజిక్కోడ్ స్థానం నుంచి పోటీ చేసిన రియాస్ పరాజయం చెందారు. కాగా..2020 జూన్ 15న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో విజయన్ కుమార్తె వీణ, రియాస్‌ల వివాహం జరిగింది.
Pinarayi Vijayan’s son-in-law won in Kerala Elections