Wednesday, January 22, 2025

మహాలయం ఏ మాసంలో చేస్తారు ?… పితృ దోషాలు అంటే ఏంటి?

- Advertisement -
- Advertisement -

మహాలయ పక్షం…..! మహాలయ పక్ష ప్రారంభం /శుద్ధ పూర్ణిమ పితృ పక్షం మొదలయ్యే రోజు. ఇక్కడ నుండి వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలు పూజలకు ఉద్దేశించినవి.బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు.ఈ మహాలయ పక్షములో ప్రతి దినమును గాని, ఒకనాడు గాని శ్రాద్ధము చేయవలెను. అట్లు చేసినవారి పితరులు సంవత్సరము వరకును సంతృప్తులగుదురని స్కాంద పురాణము నాగర ఖండమున ఉంది.

పితృ దోషాలు అంటే ఏంటి?
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు

పితృ దోషాల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు?

పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితంలో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.

పితృ దోషాల నివారణకు పరిష్కారాలు?

మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. ఆ రోజు వారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తించక పొతే దీవెనకు బదులుగా శపించి వెళ్ళిపోతారు.
శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాల లోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది, కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.
తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు.

ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది.  ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పుత్రకామన గలవారికి ఫలం లభిస్తుంది. షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో శ్రేష్ఠ గౌరవం లభిస్తుంది.

సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది. అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది.  దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది. ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది.  ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది. త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి. చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది. అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News