గ్లాస్గో సదస్సులో భారత్ సందేశం
గ్లాస్గో : కార్బన్ ఉద్గారాల కట్టడి విషయంలో సంపన్న దేశాలే కొంత ఔదార్యం, కావల్సినంత త్యాగానికి దిగాలని భారతదేశం సూచించింది. గ్లాస్గోలో ఐరాస ఆధ్వర్యపు వాతావరణ మార్పుల సదస్సు నేపథ్యంలో భారత్ వాదనను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పీయూష్ గోయల్ విన్పించారు. ఇప్పటికే పలు ధనిక దేశాలు భారీ స్థాయి ఇంధన వాడకపు ఫలాలను అనుభవించాయి. ఇటువంటి దేశాలు వాయుకాలుష్య నివారణలో పలు చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. ఈ విధంగా ఏర్పడే కార్బన్ వాయువుల ఖాళీలను ఎదుగుతున్న దేశాలు తమ పారిశ్రామిక అవసరాల దిశలో వాడుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు.
సమగ్ర వాతావరణ పరిరక్షణ దిశలో పూర్తి స్థాయి శూన్య కాలుష్య వాయువుల ప్రసరణ కట్టడి అవసరం. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ఈ కోణంలో సంపన్న, ఇతర దేశాల మధ్య సరైన సమతూకతను పాటించడం అత్యవసరం అన్నారు. కార్బన్ ఉద్గారాల వెల్లడి, వీటిని నివారించిన శాతాన్ని బేరీజుకువేసుకుని ఇక్కడ జరిగే కాప్ 26 సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోవల్సి ఉందన్నారు. భారతదేశం వర్థమాన ధేశాల గొంతుకగా నిలుస్తుందన్నారు. నెట్ జీరో కాలుష్య సాధనకు అవసరం అయిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందలేదని, సరైన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చే దశ తరువాత ఈ నెట్ జీరో టార్గెట్‌ను ఖరారు చేసుకోవల్సి ఉంటుందన్నారు.