ఢిల్లీ: ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జివిఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి సమాధానమిచ్చారు. పైగా అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని జివిఎల్ ఆరోపించారు. వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదన్నారు. డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడ విచారణ జరపాలని మంత్రిని జివిఎల్ కోరారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుకు డబ్బు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్ము ముందుగానే ముందస్తు రూపంలో ప్రధాన మోడీ అదేశాల మేరకు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా గోయల్ పేర్కొన్నారు.