Monday, December 23, 2024

పిజ్జా డెలివరీలో ఆలస్యం: కస్టమర్ వీరంగం

- Advertisement -
- Advertisement -

పుణె: తాను ఆర్డర్‌చేసిన పిజ్జా డెలివరీ ఆలస్యం అయిందన్న కోపంతో ఒక 27 ఏళ్ల వ్యక్తి డెలివరీ బాయ్‌పై చేయి చేసుకోవడమేగాక గాలిలో కాల్పులు జరిపి కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

చేతన్ పడ్వాల్ అనే వ్యక్తి సోమవారం రాత్రి నగరంలోని వఘోలీ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ పిజ్జా ఔట్‌లెట్ నుంచి పిజ్జా కోసం ఆర్డర్ చేశాడు. అయితే రుషికేష్ అన్నపూర్వే అనే డెలివరీ బాయ్ పిజ్జా డెలివరీ చేయడం కొంత ఆలస్యం అయింది. దీంతో చేతన్ కోపంతో ఊగిపోతూ అతనిపై తిట్ల వర్షం కురిపించాడు. అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పిజ్జా ఔట్‌లెట్‌కు చెందిన మరో ఇద్దరు ఉద్యోగులు చేతన్ ఇంటికి చేరుకుని రుషికేష్‌ను ఎందుకు కొట్టావంటూ నిలదీశారు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ చేతన్ వారిలో ఒకరి కాలర్ పట్టుకుని ఒక దెబ్బవేశాడు. అంతటితో ఆగకుండా పరుగున బయటకు వెళ్లి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులో నుంచి రివాల్వర్ బయటకు తీసి గాలిలో కాల్పులు జరిపాడు.

పిజ్జా డెలివరీ బాయ్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లోనికండ్ పోలీసులు కేసు నమోదు చేసి చేతన్‌ను అరెస్టు చేశారు. చేతన్ గాలిలోకి జరిపిన కాల్పుల వల్ల పై అంతస్తులలో నివసించే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఎప్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News