దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం జెజు ఎయిర్ సంస్థకు చెందిన ప్రయాణికుల విమానం రన్‌వేపై కూలిన విషయం విదితమే. ఆ పెను ప్రమాదానికి సంబంధించిన దృశ్మాలు హృదయాలను కలచివేశాయి. విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 181 మంది ప్రయాణించగా 179 మంది మృత్యువాత పడ్డారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిద్దరూ విమాన సిబ్బందే కావడం గమనార్హం. మరి అంత మంది చనిపోయిన ఘోర ప్రమాదంలో వారిద్దరూ ఎలా బతికారు? విమానంలో ఎక్కడ కూర్చున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రాణాలతో బయటపడిన ఇద్దరూ విమానం వెనుక భాగంలో కూర్చున్నారు. విమాన ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే కమర్షియల్ ఫ్లైట్స్‌లో వెనుక భాగాలు కొంతలో కొంత సురక్షితమైనవని నివేదికలు సూచిస్తున్నాయి.
విమాన ప్రమాదాలపై 2015లో ‘టైమ్ మ్యాగజైన్’ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెనుక సీట్లలో మరణాల రేటు కాస్త తక్కువగా ఉన్నట్లు తేలింది. మరణాల రేటు మధ్య సీట్లలో 39 శాతం, ముందు సీట్లలో 38 శాతం, వెనుక సీట్లలో 32 శాతంగా ఉందని తేలింది. కాగా, దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 32 ఏళ్ల లీ, 25 ఏళ్ల క్వాన్ అనే ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మంటల్లో దగ్ధం అవుతున్న వెనుక భాగం నుంచి వారిద్దరినీ రెస్కూ సిబ్బంది రక్షించారు. స్పృహలోకి వచ్చిన లీ తనకు ఏమైందని, తాను ఎక్కడ ఉన్నానని పదే పదే అడుగుతోందని వైద్యులు సోమవారం ప్రకటించారు. లీ ఎడమ భుజం విరిగిపోగా, తలపై గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఇక క్వాన్‌కు చీలమండ విరిగిందని, అతను తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్నాడని వైద్యులు చెప్పారు.