ఇటీవల దక్షిణ కొరియా, కజకిస్తాన్‌లలో వరుసగా జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలను మరువక ముందే అమెరికాలో మరొక ప్రమాదం జరిగింది. దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఒక భవనం రూఫ్ టాప్‌పై విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరి 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్లెర్టోన్లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2.09 గంటల సమయంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలియజేశారు. ఫుల్లెర్టోన్ మునిసిపల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో, ప్రఖ్యాత డిస్నీలాండ్ పార్క్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.
క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగసిపడ్డాయని, దట్టమైన పొగ ఆవరించిందని, సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశామని పోలీసులు తెలియజేశారు. భద్రత నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాన్ని ఖాళీ చేయించామని వారు తెలిపారు, విమానం కూలిన భవనం వాణిజ్య సముదాయం అని, భవనం కొంత మేర దెబ్బ తిన్నదని పోలీసులు చెప్పారు. కాగా, విమానం ఏ రకమైనది? ప్రమాదానికి కారణాలు ఏమిటి? అనే సమాచారం తెలియరాలేదు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే కూలిపోయిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘ఫ్లైట్ అవేర్’ గుర్తించింది.