న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ తలెత్తడంతో, టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ర్యాన్ ఎయిన్ విమానం బుధవారం మొరాకోలో అగాదిర్ నుంచి లండన్‌కు బయల్దేరింది.
ఇంతలో ఓ వ్యక్తి … మహిళా ప్రయాణికురాలి దగ్గరకు వచ్చి, తన భార్య పిల్లలతో కూర్చోడానికి సీటును ఇవ్వాల్సిందిగా అడిగాడు. దానికి ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు దిగాడు. మహిళ భర్త వారించడంతో వాగ్వాదం నెలకొంది. మహిళ బంధువులు కూడా అదే విమానంలో ఉండడంతో వారు సదరు వ్యక్తితో గొడవకు దిగారు. వారు ఒకరిని ఒకరు దూషించుకుంటూ దాడికి దిగుతుండడంతో ఇతర ప్రయాణికులు, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది విమానాన్ని మరకేష్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
విమానంలో ఉన్న 36 నిమిషాలు ఒక నరకంలో కనిపించిందని, పిల్లలు భయంతో ఏడుస్తూనే ఉన్నారని ఓ ప్రయాణికురాలు వాపోయారు. ఇదిలా ఉండగా, మరో ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో మరకేష్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే వైద్యులు అతడికి ఆక్సిజన్ పెట్టారు. ఆరోగ్యం సరిగా లేనందున విమానం దిగాల్సిందిగా కోరగా, అందుకు నిరాకరించాడు. అయితే ఎట్ట కేలకు అధికారులు అతడిని విమానం నుంచి దించేశారు. ఈ సంఘటనతో విమానం లండన్ చేరుకోవడానికి ఆలస్యమైంది. దీనిపై ర్యాన్ ఎయిర్ అధికారులు స్పందిస్తూ కొందరి వల్ల ఇతర ప్రయాణికులకు జరిగిన ఆలస్యానికి, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం” అని ప్రకటనలో పేర్కొన్నారు.