మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవులలోని మాలేకు విమాన సర్వీసు పున:ప్రారంభమైంది. ఇండిగో విమాన సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కరోనా ప్రభావం తగ్గడంతో ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మాల్దీవుల్లోని మాలే కు విమాన సర్వీసులను పున:ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం 2.20 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు మాల్దీవుల్లోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ విమానం చేరుకుంది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, ఇండిగో అధికారులు దీనిని ప్రారంభించారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మాలేకు వారంలో మంగళవారం, గురువారం, ఆదివారం మూడుసార్లు విమానాలను నడపనున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. అదే విధంగా అక్టోబర్ నెల 15 నుంచి వారంలో సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నాలుగు సార్లు ఈ విమానాలు నడుస్తాయని ఇండిగో సంస్థ వెల్లడించింది. సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులు, సెలవులకు వెళ్లేవారు ఈ విమాన సర్వీసును ఎంతో ఇష్టపడతారని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. హైదరాబాద్ -మాలేను కలిపే సేవలతో ప్రయాణికులు మాల్దీవులలో బీచ్ అందాలను ఆస్వాదించవచ్చని ఆయన పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొత్తగా జాతీయ, అంతర్జాతీయ ప్రదేశాలకు విమాన సేవలను ప్రారంభించేందుకు పలు ఎయిర్ లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
Planes resume to Maldives from Shamshabad Airport