బృహస్పతి గ్రహం కన్నా 13 రెట్లు పెద్దదైన దట్టమైన గ్రహాంతర గ్రహాన్ని భారతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొన గలిగింది. అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చి లేబొరేటరీ (పిఆర్‌ఎల్ ) ప్రొఫెసర్ అభిజిత్ చక్రవర్తి ఈ బృందానికి నేతృత్వం వహించారు. ఈ శాస్త్రవేత్తల బృందం ఇంతవరకు గుర్తించిన బాహ్యగ్రహాల్లో ఇది మూడోది. ఈ అధ్యయన విశేషాలు “జర్నల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లెటర్స్” లో వెలువడ్డాయి. భారత్‌తోపాటు జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా దేశాల శాస్త్రవేత్తలు ఈ బృందంలో చేరి పరిశోధనలు కావించారు.
గ్రహం ద్రవ్యరాశిని కచ్చితంగా లెక్కించడానికి ఎంటి అబు లోని గురుశిఖర్ అబ్జర్వేటరీలో స్వదేశీయంగా తయారైన పిఆర్‌ఎల్ అడ్వాన్స్‌డ్ రేడియల్ వెలాసిటీ అబూ స్కై సెర్చ్ స్పెక్ట్రోగ్రాఫ్ (పిఎఆర్‌ఎఎస్)ను వినియోగించుకున్నారు. ఈ బాహ్యగ్రహం ద్రవ్యరాశి 14జి/ సిఎం3 వరకు ఉందని లెక్కగట్టారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహం కక్ష నక్షత్రం టిఒఐ4603 గా వ్యవహరిస్తున్నారు. అసాధారణమైన సాంద్రత కలిగిన కొన్ని భారీ ద్రవ్య దిగ్గజ గ్రహాల్లో ఇదొకటిగా భావిస్తున్నారు. ఇది భారీ ద్రవ్యరాశి పరివర్తన ప్రాంతం నుంచి అతి తక్కువ ద్రవ్యరాశి మరుగుజ్జు గ్రహాల మధ్య ఈ గ్రహం ఉన్నట్టు కనుగొన్నారు.
ఈ భారీ ద్రవ్యరాశి గ్రహాలు ఐదింటికన్నా వేరే గ్రహాల్లో ఇది కొత్తగా చేరినట్టు చెబుతున్నారు. ఇది కచ్చితంగా గ్రహమేనని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. దీనికి టిఒఐ 4603 బి లేదా హెచ్‌డి 245134 బి అని పేరు పెట్టి పిలవాలనుకుంటున్నారు. ఈ గ్రహం భూమికి 731 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. తన నక్షత్రం చుట్టూ ప్రతి 7.24 రోజులకోసారి పరిభ్రమిస్తుంది. దీని ఉష్ణోగ్రత 1396 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంది. గ్రహం ఎప్పుడూ దహన దశలో ఉంటుంది.
ఈ బాహ్యగ్రహం ఉపరితల ఉష్ణోగ్రత 1670 కె వరకు ఉంటోందని, అసాధారణ విపరీత అలల కదలికతో ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఇటువంటి వ్యవస్థలను కనుగొనడం వల్ల భారీ ద్రవ్యరాశి కలిగిన బాహ్య గ్రహాల ఆవిర్భావం, కదలికలు, పరిణామం తదితర అంతర్దశలను సందర్శించడానికి వీలవుతుందని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది.