Monday, March 31, 2025

ఆ గ్రహ శకలంతో మనకు ముప్పులేదట!

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ వేగంగా పరిభ్రమిస్తున్న ఒక గ్రహ శకలం 2032లో భూమిని ఢీకొనే అవకాశం ఉందని అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) ఇటీవల హెచ్చరించిన విషయం విదితమే. నిరుడు డిసెంబర్27న ఈ గ్రహ శకలాన్ని చిలీ పరిశోధకులు గుర్తించారు. సూర్యుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తున్న ఈ గ్రహ శకలం వేగంగా భూమి వైపు దూసుకువస్తోందని వారు తెలిపారు. ఈ నెల 18న నాసా జరిపిన పరిశీలనలో 2024 వైఆర్ 4 గ్రహ శకలం భూమిని ఢీకొనేందుకు 3.1 శాతం అవకాశం ఉందని తేలింది.

దీనితో ఈ గ్రహ శకలాన్ని లెవెల్3 శకలంగా నాసా ప్రకటించింది. అయితే, ఈ గ్రహ శకలంతో ఎటువంటి ముప్పూ లేదని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఇఎస్‌ఎ) నిర్ధారించింది. ఈ నెల 19న జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 1.5గా తేలిందని, సోమవారం(24న) జరిపిన పరిశోధనలో ముప్పు శాతం 0.002కు తగ్గిందని నాసా కూడా వెల్లడించింది. దీనితో ఈ గ్రహ శకలంతో భూమికి ముప్పు లేదని తేల్చిహెచ్చరికలను నాసా ఉపసంహరించుకుంది. అయితే, ఈ గ్రహ శకలంపై నిఘా కొనసాగిస్తామని నాసా శాస్త్రవేత్తలు తెలియజేశారు.

దీని పరిమాణం, లోపలి మూలకాల వివరాల గురించి పరిశోధన జరుపుతామని వారు చెప్పారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో ఈ గ్రహ శకలాన్ని మార్చి, మే నెలల్లో పరిశీలించనున్నట్లు వారు తెలియజేశారు. 2024 వైఆర్ 4 వ్యాసం సుమారు 50 మీటర్లు ఉండవచ్చునని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాగా, సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుండడం వల్ల ఈ గ్రహ శకలం కొన్ని రోజుల పాటు కనిపించదని, 2028 జూన్‌లో మళ్లీ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News