మన తెలంగాణ / హైదరాబాద్ : వేసవి కాలం మొదలవవడంతో గృహ కరెంట్ వాడకం పెరిగింది. మరోవైపు పంటల సాగుకూ విద్యుత్ వినియోగమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ త్వరలోనే 17 వేల మెగావాట్లకు చేరుకునే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,601 మెగావాట్లు నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, గద్వాల్, ఆలంపూర్, ఇటిక్యాల, మానోపాడ్, నల్లగొండ జిల్లాతో పాటు శ్రీశైలం వరకు పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తున్నారు. వరి, కూరగాయల సాగే ఎక్కువగా ఉండడంతో విద్యుత్ డిమాండ్ సైతం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా డిస్కమ్స్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆఫీసర్లు ఏసీ రూములకే పరిమితం కావద్దని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లు దాటడంతో ప్రజాభవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేస్తు దిశా నిర్దేశం చేశారు. డిమాండ్, సరఫరాకు మధ్య గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశించారు.
కరెంటు కోతలు, లైన్లలో సమస్యలు వస్తే అధికారులతోపాటు తనకు కూడా ఫోన్ చేయవచ్చని డిప్యూటీ సీఎం చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాన్స్ కో ఉన్నతాధికారుల సూచనల మేరకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వారం రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అవాంతరాలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఎక్కడ కరెంటు పోయినా రెప్పపాటులోనే ప్రత్యామ్నాయ మార్గాల నుంచి ఇవ్వాలని సూచిస్తున్నారు.
2,282 అదనపు ట్రాన్స్ ఫార్మర్లు : వేసవికి విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అంతరాయాలు వచ్చే అవకాశం సైతం ఉంటుంది. దీంతో డిస్కంలు ఈ సమ్మర్ సీజన్ కు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,282 అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిలో 301, సిద్దిపేటలో 436, మొదక్‌లో 143, మహబూబ్ నగర్‌లో 352, నాగర్ కర్నూలులో 88, జోగులాం గద్వాలలో 75, వనపర్తిలో 77, నల్లగొండలో 398, సూర్యాపేటలో 305 ఇలా అవసరమైన ప్రతి జిల్లాలోనూ ట్రాన్స్ ఫార్మర్లు పెట్టారు.
ప్రస్తుతం 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మరి కొన్ని త్వరలోనే ఏర్పాటు చేయిస్తామని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండి ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను ఆయన జిల్లా కలెక్టర్లతో కలిసి ప్రారంభిస్తున్నారు. వీటితోపాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్ (పీటీఆర్)లు మరో 99 అదనంగా ఏర్పాటు చేశారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 33 కేవీ ఫీడర్ కొత్త విద్యుత్ లైన్లతో పాటు, 11 కేవీ ఫీడర్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మహబూబ్ నగర్, నారాయణపేటతోపాటు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల సబ్ స్టేషన్, అలాగే నకిరేకల్ దగ్గర నిర్మితమవుతున్న ఆర్లగడ్డగూడెం 33 కేవీ ఫీడర్ నాణ్యతను సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పరిశీలించారు.
పంటల సాగుకు ఉచిత విద్యుత్ : పంటల సాగుకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో సాగు విస్తీర్ణంతోపాటు విద్యుత్ వినియోగం సైతం పెరుగుతోంది. నల్లగొండ జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు రెండువేల మెగావాట్ల విద్యుత్ వినియోగమయ్యేది. ఇప్పుడు అది 2,400 మెగావాట్లకు చేరింది. తెలంగాణలోని ప్రతి జిల్లాల్లో సాగునీటి లభ్యత ఆధారంగా విద్యుత్ వినియోగం ఉంటోంది. మెదక్ లో గతంలో 1,940 మెగావాట్లు వినియోగించగా అది 2,282 మెగావాట్లకు చేరింది. ఏ విధంగా చూసుకున్నా ఈ సమ్మర్ సీజన్ విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండడంతోరాజధానితోపాటు జిల్లాలకు కూడా విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది.