Saturday, November 16, 2024

మొండి బ్యాక్టీరియాను నివారించే కొత్త యాంటీబయోటిక్

- Advertisement -
- Advertisement -

శాస్త్రవేత్తలు మొక్కలకు సంబంధించిన ఒక విషపదార్ధాన్ని కనుగొన్నారు. అదే హానికరమైన బ్యాక్టీరియాను వెళ్లగొట్టే ఏకైక ప్రక్రియగా రూపొంది, అత్యంత శక్తివంతమైన కొత్త స్థాయి యాంటీబయోటిక్స్‌ను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొత్త యాంటీబ్యాక్టీరియల్ ఔషధాలను అభివృద్ధి చేయడాన్ని వైద్యులు ప్రశంసిస్తున్నారు. ఇ కోలి వంటి బహు ఔషధాలను (multidrug resistant) ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియా నిదానంగా పెరుగుతోందని గత కొన్నేళ్లుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచం లోని ఆరోగ్యభద్రతకు ఇదో పెనుసవాలుగా మారింది. ఈ నేపథ్యంలో హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించగల కొత్త యాంటీబయోటిక్ రూపొందడం ఎంతైన అభినందనీయం.

ఎల్బిసిడిన్ (albicidin) అనే ఈ కొత్త యాంటీబయోటిక్ ప్రస్తుతం వాడుకలో ఉన్న ఔషధాలకన్నా ప్రత్యేకంగా బ్యాక్టీరియాపై పూర్తిగా దాడి చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్రిటిష్, జర్మన్, పోలిష్ శాస్త్రవేత్తలు సమష్టిగా పరిశోధనలు సాగించి ఈ కొత్త యాంటీబయోటిక్ ‘ఎల్బిసిడిన్’ ను కనుగొన్నారు. జర్నల్ నేచర్ కెటలిసిస్ లో వీరి పరిశోధన వివరాలు ఇటీవలనే వెలుగు లోకి వచ్చాయి. బాక్టీరియా వ్యాధులను నివారించడానికి దీనివల్ల కొత్త మార్గం ఏర్పడుతుందని వీరి పరిశోధన అభిప్రాయపడింది. నార్విచ్ లోని జాన్ ఇన్సెస్ సెంటర్‌లో శాస్త్రవేత్త డిమిట్రీ ఘిలరోవ్ నేతృత్వంలో పరిశోధన సాగింది. ప్రయోగశాలలో ఎల్బిసిడిన్‌తో తమకు ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాలేదని. ఎల్బిసిడిన్ ఆధారిత యాంటీబయోటిక్స్‌ను ఎలాంటి బ్యాక్టీరియా అయినా ప్రతిఘటించడం అనేది చాలా కష్టమని డిమిట్రీ ఘిలరోవ్ దృఢ విశ్వాసం వెలిబుచ్చారు. జాంతోమొనాస్ ఎల్బినియన్స్ (xanthomonas albinians ) అనే మొక్కల హానికరమైన బ్యాక్టీరియా నుంచి ఎల్బిసిడిన్ ను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. జాంతో మొనాస్ ఎల్బినియన్స్ మొక్కలపై వినాశనకరమైన తెగుళ్లను వ్యాపింప చేస్తుంది. ముఖ్యంగా చెరకు పంటలో ఆకుమంట (leaf scad ) అనే తెగులును వ్యాపింప చేస్తుంది.

ఈ వ్యాధికారకం (pathogen) ఎల్బిసిడిన్‌ను ఉపయోగించుకుని మొక్కలను నాశనం చేస్తుంది. కానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఇది బ్యాక్టీరియాను కూడా చాలా శక్తివంతంగా చంపుతుందని తేలింది. ఆనాడు ఎల్బిసిడిన్ ఏ విధంగా కచ్చితంగా బ్యాక్టీరియాపై దాడి చేస్తుందో మనకు తెలీదు. అందువల్ల కొత్త యాంటీబయోటిక్‌గా దీన్ని వాడుకోలేదు. మానవ శరీరంలో అనేక సమస్యలు ఎదురవుతాయన్న భయం కూడా ఉండేది. అయితే ఇప్పుడు దీని సత్తా తెలిసిందని డిమిట్రీ ఘిలరోవ్ స్పష్టం చేశారు. జర్మనీ లోని బెర్లిన్ టెక్నిస్కే యూనివర్శిటీ, పోలాండ్ లోని క్రకోవ్ జగియెల్లోనియన్ యూనివర్శిటీ పరిశోధకులు ఎల్బిసిడిన్ ప్రభావంపై వరుసగా ప్రయోగాలు చేశారు. ఎలా ఇది బ్యాక్టీరియాను నాశనం చేస్తుందో నిరూపించే టెక్నిక్‌లు ఉపయోగించారు. ఇప్పుడు ఔషధ సంబంధ మైన లక్షణాలు కలిగిన సమర్ధవంత యాంటీబ్యాక్టీరియాగా ఎల్బిసిడిన్‌ను అభివృద్ధి చేయగల ప్రక్రియలను అర్థం చేసుకున్నామని డిమిట్రీ పేర్కొన్నారు. యాంటీబయోటిక్ ఔషధాలను ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియా తీవ్రంగా పెరుగుతుండడం ప్రపంచంలో తీరని సమస్యగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

విచక్షణా రహితంగా యాంటీబయోటిక్స్‌ను వాడడం వల్లనే ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియా పుట్టుకొస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని నిరోధించడానికి వైద్యపరంగా అత్యధిక వ్యయం భరించవలసి వస్తోంది. ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవలసి రావడమే కాక, చివరకు మరణం సంభవించే ప్రమాద పరస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. యాంటీబయోటిక్‌లను ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియాల వల్ల ప్రతిరోజూ 3500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, 2019 లో 1.2 మిలియన్ మంది ఈ మొండి బ్యాక్టీరియా వల్లనే మరణించారని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కొత్త యాంటీ బయోటిక్ ఎల్బిసిడిన్ రూపొందడం కొత్త ఆయుధం వైద్యపరంగా లభించినట్టే. అయితే వైద్యపరంగా ఇది అమలు లోకి రాడానికి మరి కొంతకాలం పట్టవచ్చు. ఇప్పుడు ప్రభుత్వాలు ఈ దిశగా ముందుకు సాగి, ఎల్బిసిడిన్ ఆధారిత వ్యాక్సిన్ తయారీకి వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించ వలసిన అవసరం ఉంది. ఈమేరకు రాయితీలు కల్పించడమే కాక, యాంటీబయోటెక్ అభివృద్ధి సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే వైద్యరంగానికి మేలు చేసిన వారవుతారని శాస్త్రవేత్త డిమిట్రీ ఘిలరోవ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News