వైరస్ కొత్త వేరియంట్లను పుట్టిస్తుంది : వైద్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ: వివేచనారహితంగా, అశాస్త్రీయంగా కొవిడ్19 పేషెంట్లకు ప్లాస్మా ధెరపీ నిర్వహించడం వల్ల నష్టమే తప్ప, ప్రయోజనముండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అశాస్త్రీయంగా ప్లాస్మా థెరపీ ఇవ్వడం వల్ల వైరస్ కొత్త వేరియంట్లు ఆవిర్భవించడానికి కారణమవుతోందని కూడా వారు అంటున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారు కె.విజయరాఘవన్‌కు వారు లేఖ రాశారు. లేఖపై సంతకాలు చేసినవారిలో వ్యాక్సినాలజిస్ట్ గగన్‌దీప్‌క్యాంగ్, సర్జన్ సిఎస్ ప్రమేశ్ ఉన్నారు. ఇదే లేఖను వారు ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బల్‌రామ్ భార్గవ్, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియాకు పంపారు. ప్లాస్మా థెరపీ వల్ల కొవిడ్ పేషెంట్లు త్వరగా కోలుకున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని వారు తెలిపారు. తాజా పరిశోధనల్లోనూ అది స్పష్టమైందన్నారు. కొవిడ్19 నుంచి కోలుకున్నవారి రక్తం నుంచి ప్లాస్మాను తీసుకొని కొత్తగా కొవిడ్ సోకిన వారికి ఇవ్వడాన్ని ప్లాస్మా థెరపీ అంటారన్నది తెలిసిందే.