అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యేక కార్యచరణ
నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యుపి) ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి ( జూలై 1) రాష్ట్రవ్యాప్తంగా ఒకసారి వినియోగించి వదిలి వేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సరఫరా ముడిసరుకులను, ప్లాస్టిక్ డిమాండ్‌ను తగ్గించడానికి సరియైన చర్యలు తీసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజలను చైతన్య పరచడంతో పాటు, పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా పరిపాలన యంత్రాంగానికి అవగాహన కల్పించడం, మార్గ నిర్దేశం చేయడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పిసిబి బహుముఖ విధానాన్ని అవలంభించనుందని తెలిపారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు, ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించేందుకు కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వన్ టైం సర్టిఫికేట్ లను జారీ చేస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్ధతుగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (-సిపెట్), నిమ్స్‌మే శిక్షణ సంస్థ, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్ అసోసియేషన్ల సహకారంతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ బదులుగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రత్యమ్నాయ మార్గాలను సూచిస్తూ… వర్క్ షాపులను నిర్వహిస్తుందని వెల్లడించారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని రిపోర్ట్ చేయడానికి, ఫిర్యాదులను చేయడానికి ఎస్‌యుసిపిసిబి అనే ప్రత్యేక ఆన్‌లైన్ యాప్ కూడా అందుబాటులోకి తెచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ ఒకసారి వినియోగించి వదిలివేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ప్లాస్టిక్ మహమ్మారిపై విజయం సాధించగలమని, తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని ఇవ్వగలమన్నారు.
నిషేధిత జాబితాలోని ప్లాస్టిక్ వస్తువులు ఇవే..
ఇయర్‌బాడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్- పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్ , ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు..వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌లకు వాడే పల్చటి ప్లాస్టిక్, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్, పివిసి బ్యానర్లు , ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు.