ప్లాస్టిక్ రీసైక్లింగ్‌కు ఎంజిబిఎస్ బస్టాండ్‌లో మిషన్ అందుబాటులోకి…
ట్విట్టర్‌లో వెల్లడించిన ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రకృతి మనకు చాలా ఇచ్చింది. మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం, ముందు తరాలకు స్వచ్చమైన ప్రకృతిని ఇచ్చేద్దాం అంటూ ఆర్టీసి అధికారులు తమవంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమవంతుగా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయాలని నిర్ణయించింది. బస్టాపుల్లో నిత్యం వేలాది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లును డస్ట్‌బిన్‌లో ప్రయాణికులు పడేస్తుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అతి పెద్ద బస్టాప్ అయిన హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్‌లో ముందుగా ప్లాస్టిక్ బాటిళ్లను రీసైక్లింగ్ చేసే మిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తద్వారా ప్రయాణికులు స్వయంగా తమ వద్ద వాడి పడేసే ప్లాస్టిక్ బాటిల్‌ను రీసైక్లింగ్‌ను చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎండి సజ్జనార్ తన అధికారిక ట్విట్టర్‌లో ప్రకటించారు. దీనిని ఎలా వినియోగించాలో కూడా ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. సజ్జనార్ నిర్ణయంతో రానున్న రోజుల్లో బస్టాప్‌లో ప్లాస్టిక్‌ను నిర్మూలించే అవకాశం ఉందని నెటిజన్లు ట్వీట్ చేశారు.