Saturday, November 23, 2024

ప్రపంచం ముంగిట్లో ప్లాస్టిక్ ముప్పు

- Advertisement -
- Advertisement -

భూమిపై జ్ఞానవిప్లవం, వ్యవసాయ విప్లవాలతో ఎదిగిన మానవుడు కాలగమనంలో సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ‘నియోలిథిక్ రెవల్యూషన్’ కారణంగా భూమి పై వ్యవసాయం, పంటలు పండించడానికి నేలను, జంతువులను, ఆహారంతో పాటు ఇతర ఉత్పత్తులను అందించడానికి పరిసరాలను మార్చే మొదటి ప్రయత్నం జరిగింది. నాటి నుండి మానవుడు తన అవసరాల కోసం పరిసరాలలో, వాతావరణంలో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పారిశ్రామిక విప్లవం, వైజ్ఞానిక విప్లవాల నేపధ్యంలో నేడు అభివృద్ధి, ఆధునికత, లగ్జరీలైఫ్, సాంకేతికతల పేరుతో భూమిపై మనిషి చేసే అనాలోచిత, ప్రకృతి విరుద్ధ చర్యల వల్ల అనేక పర్యావరణ సమస్యలు ముంచుకొస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అసాధారణ వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి సమస్యలు నేడు ప్రపంచానికి అతిపెద్ద సవాళ్ళుగా మారాయి.

ఈ నేపథ్యంలో 1972లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ‘మానవుడు- పర్యావరణం’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. 1973 జూన్ 5న తొలిసారి ఒకే ఒక భూమి (ఓన్లీ వన్‌ఎర్త్) అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ పండుగ జరిగింది. అదే క్రమంలో గత సంవత్సరం జూన్ 5న తిరిగి అదే ఇతివృత్తం ఒకే ఒక భూమి అనే నినాదంతో స్వీడన్ ప్రధాన వేదికగా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకొన్నాయి.ఈ సంవత్సరం 2023 జూన్ 5న ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడిద్దాం (బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్) అనే ఇతివృత్తంతో ఐవరి కోస్ట్ (వెస్ట్ ఆఫ్రికా) ప్రధాన వేదికగా నెదర్లాండ్ భాగస్వామ్యంతో 51వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచాన్ని ప్లాస్టిక్ రహితం చేయడంతో పాటు ప్లాస్టిక్ కాలుష్యంవల్ల మానవులకు, బౌమ్యజీవులకు, జలజీవులకు కలిగే ప్రమాదం గురించి, పర్యావరణ సంక్షోభ మార్పు ల గురించి అవగాహన కల్పించి, మెరుగైన పర్యావరణం కోసం ప్రజలను భాగస్వాముల చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నవి.

ప్లాస్టిక్ కాలుష్యంతో పెను ప్రమాదం
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ప్లాస్టిక్ అనేది ఒక పునరుద్ధరించలేని వనరు. ఫార్మాల్దీ హైడ్, ఫినాల్ ఉపయోగించి మొదటిసారిగాప్లాస్టిక్‌ను 1907లో బెల్జియన్ రసాయన శాస్త్రవేత్త లియో బేక్ ల్యాండ్ కనుగొన్నాడు. ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థం. దీంతో అనేక రకాలైన అందమైన ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయబడుతాయి. కానీ వాటి వ్యర్థాలు పర్యావరణానికి కలిగించే ముప్పు మాత్రం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 40 కోట్ల టన్నులకుపైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నది. ఇందు లో సగం కప్పులు, బ్యాగులు, ప్యాకేజింగ్ వంటి సింగిల్ యూజ్ ఉత్పత్తులలో ఉపయోగించబడుతున్నది. ఈ ఉత్పత్తిని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టకుంటే 2050 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 110 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలలో 17 శాతం కాల్చివేయబడుతున్నాయి. కేవలం 15 శాతం పునర్వినియోగం అవుతున్నాయి. ఈ రెండు ప్రక్రియల ద్వారా గాలి కాలుష్యం, నీటి కాలుష్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగుట్టలుగా భూమిపై పేరుకొనిపోయి ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమై మానవునితో పాటు బౌమ్య జీవులకు, జలజీవులకు అనేక వ్యాధులను కలుగజేస్తున్నాయి. భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి సుమారు 20-500 సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞుల అంచనా.

అయితే ఎండకు, వానకు, గాలికి, సముద్రాలలోని ఉప్పు నీటికి విచ్ఛిన్నం చెంది మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలుగా, ఫైబర్ కణాలుగామారి తాగే నీటితో, పీల్చే గాలితో జీవుల శరీరాలలోకి చేరి క్రమంగా ఆహారపు గొలుసు సరఫరా ద్వారా మనుషులలోకి ప్రవేశించి క్యాన్సర్, అల్సర్స్ చర్మ వ్యాధులు వంటి రకరకాల రోగాలకు కారణమవుతున్నాయి. కాలుష్యం అనగానే వాహనాలు, ఫ్యాక్టరీ గొట్టాల నుండి పొగ మాత్రమే కాదు. ఇండ్లల్లో టైల్స్ తుడువడానికి వాడే క్లీనర్స్ నుంచి సబ్బులు, షాంపులు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ ఉత్పత్తుల దాకా అన్నీ కాలుష్య కారకాలే. మనం నిత్యం ఉపయోగించే పెయింట్స్, నాన్‌స్టిక్ కుక్‌వేర్, స్టెయిన్ రెసిస్టెన్స్ ప్రొడక్ట్, ఫోటోగ్రపీ, మంటలు ఆర్పడానికి వాడే నురగ, ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజింగ్, ఫెస్టిసైడ్స్‌లు మొదలగు వాటిలో పాలీఫ్లోరో అల్కైల్స్, థాలేట్స్, బిస్ఫినాల్ వంటి ప్లాస్టిక్ విష రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాస్టిక్ కాలుష్య కారకాల వల్ల మానవునిలో ప్రత్యుత్పత్తి అవయవాలు నానాటికీ కుంచించుకుపోతూ క్రమంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతున్నదని, తద్వారా పునరుత్పత్తి సామర్థ్యం (ఫెర్టిలిటీ కెపాసిటీ) తగ్గిపోయి 2045 నాటికి మానవ మనుగడకు ముప్పు వాటిల్లనున్నదని తాజాగా కౌంట్‌డౌన్ (2021) అనే తన పుస్తకంలో ప్రముఖ అమెరికన్ పర్యావరణ పరిశోధకురాలు డాక్టర్ షన్నా స్వాన్ పేర్కొన్న విషయాన్నిగమనించాలి.

జలజీవులకు ప్లాస్టికోసిస్ ముప్పు
భూమిపై అతి ముఖ్యమైన కార్బన్ సింక్ వ్యవస్థలైన మహా సముద్రాలలోకి ప్రతి సంవత్సరం సుమారు 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రిపోర్ట్ తెలియజేస్తున్నది. ఇప్పటి వరకు సముద్రాలలో దాదాపు 75 నుండి 199 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉన్నట్లు అంచనా. మొత్తం సముద్ర వ్యర్థాలలో 85 శాతం ప్లాస్టిక్ ఉన్నట్లు, ఇవి మైక్రో ప్లాస్టిక్ హాట్ స్పాట్లను సృష్టిస్తున్నాయని, ఈ వ్యర్థాలు సముద్రాలలో మానవ ప్రేరిత ప్లాస్టిక్ పరిసరాలైన ప్లాస్టి స్పియర్‌ను ఏర్పరచడంతో జలచర జీవులకు ప్రాణసంకటంగా మారింది. ప్లాస్టిక్ నిరంతర వినియోగం వల్ల లార్డ్ హోవే ద్వీపం (ఆస్ట్రేలియా) లోని ఫ్లెష్ ఫూటెడ్ షీర్ వాటర్ అనే సముద్ర పక్షులలో ప్లాస్టికోసిస్ అనే ఫైబ్రోటిక్ వ్యాధి వస్తున్నట్లు ఆస్ట్రేలియా, బ్రిటన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు.

ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం సముద్రాలలోని ప్లాస్టిక్ కాలుష్యమేనని, ఒక్కొక్క పక్షి బరువులో 12.5 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు పరిశోధనా బృందం నాయకుడు, నేచురల్ హిస్టరీ మ్యూజి యం (లండన్) ప్రిన్సిపల్ క్యురేటర్ డాక్టర్ అలెక్స్ బాండ్ పేర్కొన్నారు. ఈ వ్యాధి వల్ల పక్షుల జీర్ణ వ్యవస్థలో దీర్ఘకాలిక మంట, మచ్చకణజాలం ఏర్పడడానికి దారితీస్తుందని, పక్షులు ఎంత ఎక్కువ ప్లాస్టిక్‌ను తింటే కణజాలంపై అంత ఎక్కువ గాయాలు, మచ్చలు ఏర్పడుతాయని పరిశోధనా బృందం రిపోర్ట్- 2023 తెలిపింది. ప్లాస్టికోసిస్ అనే వ్యాధి జంతు వ్యాధుల కొత్త యుగంలో ఒక హెరాల్డ్ కావొచ్చునని కూడా ఆ నివేదిక హెచ్చరించింది. మాక్రో ప్లాస్టిక్ కణాల వల్ల పక్షులు, తిమింగలాలు, చేపలు, తాబేళ్లు జలచర జీవులు ప్లాస్టిక్ నిండిన కడుపుతో ఆహారం తీసుకోలేక ఆకలితో అలమటించి చనిపోతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో ఆవు, గేదె తదితర పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు కోకొల్లలు. 2050 నాటికి సముద్రాలలో ఉండే చేపల కంటే ప్లాస్టిక్ సంచుల బరువే ఎక్కువగా ఉండొచ్చునన్న పరిశోధనలు ప్లాస్టిక్ కాలుష్య తీవ్రతను తేటతెల్లం జేస్తున్నాయి.

ప్లాస్టిక్ కాలుష్యాన్నిఓడిద్దాం
ప్రస్తుతం ప్రపంచ దేశాలు, యుఎన్‌ఒ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషణకు నడుం బిగిస్తున్నాయి. ఇందుకు పాలకులకు, ప్రజలకు చిత్తశుద్ధితో కూడిన కృషి ఎంతో అవసరం. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి 2022 సంవత్సరంలో 174 దేశాల ప్రతినిధులతో కూడిన యునైటెడ్ నేషన్స్ ఎన్‌విరాన్‌మెంట్ అసెంబ్లీఒక చట్టబద్ధమైన ఒప్పంద తీర్మానాన్ని ఆమోదించింది. 2024 చివరి నాటికి ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ ద్వారా మొత్తం ప్లాస్టిక్ జీవిత చక్రంపై దృష్టి పెట్టి సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాలను ప్రోత్సహించడానికి సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చునని భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై భూగ్రహం సాధించిన విజయంగా యుఎన్‌ఇపి కార్యనిర్వాహక డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ పేర్కొనడం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే స్ఫూర్తితో బయో డీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తికి పరిశోధనలు ముమ్మరం చేయాలి. వాటర్ బాటిల్స్, కప్స్, కార్ పార్ట్ తయారయ్యే కోడ్- 7 ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి.

మనదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (నిబంధనలు- 2021) ప్రకారం 30 సెప్టెంబర్ 2021 నుండి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల వర్జిన్ లేదా రీసైకిల్ ప్లాస్టిక్ క్యారి బ్యాగుల తయారీ దిగుమతి నిల్వ పంపిణీ అమ్మకాలపై గల నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. పరిశుభ్రమైన పరిసరాలు, పర్యావరణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛ భారత్ అభియాన్’ ప్రోగ్రాంలో ప్రజలు నిరంతరం పాల్గొనాలి. లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్‌విరాన్‌మెంట్ (మిషన్ లైఫ్- 2022) అనే పర్యావరణ హిత కార్యక్రమంలోని పల్లె ప్రగతి అంశాలను ప్రోత్సహించి కొనసాగించాలి. ప్లాస్టిక్ వినియోగంలో 5- ఆర్స్ అను పంచ ఫల సూత్రంలోని అంశాలైన తగ్గింపు, తిరస్కరించుట, పునర్వినియోగం, పునః చక్రీయం తొలగించటం అనునవి ప్రతి వ్యక్తి జీవనశైలిలో భాగం కావాలి. స్థానిక సంస్థల సమిష్టి సహకారంతో పౌరులందరూ ‘థింక్ గ్లోబల్లి – యాక్ట్ లోకల్లీ’ అనే ఆలోచనలకు కట్టుబడి ఉండి ‘రొట్టెను విరగ్గొట్టి తినొద్దు- కడుక్కొని తాగండి’ అనే సామెతననుసరించి, భూమిని, ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించడంలో విజ్ఞత, విచక్షణను పాటించినపుడు ప్రపంచాన్ని కాలుష్య ప్రమాదం నుండి కాపాడుకోగలం.

డా. భారత రవీందర్
9912536316

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News