Monday, December 23, 2024

ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతలో దక్షిణాఫ్రికా తీవ్రప్రయత్నం

- Advertisement -
- Advertisement -

ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో అనర్ధాలు తెస్తున్నాయి.నేలపై నుంచి నదుల్లోకి అక్కడి నుంచి సముద్రంలో చేరి కొన్ని దశాబ్దాలపాటు పేరుకుపోతుంటాయి. అక్కడ క్రమంగా మెల్లగా మైక్రోప్లాస్టిక్స్‌గా తునాతునకలవుతాయి. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ తునకలు సముద్ర ప్రాణుల పాలిట ప్రాణాంతకమవుతున్నాయి. వీటిని అవి ఆరగించి ఆకలి క్షీణించి, చివరికి అనారోగ్యంతో అంతరించిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి దక్షిణాఫ్రికా తీరంలో అనేక మంది పరిశోధనలు నిర్వహించారు. అనేక సంస్థలు నడుంకట్టుకుని సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేసే భారీ కార్యక్రమాలను చేపట్టారు.

ఇది ఒకరోజుతో పూర్తయ్యే పనికాదు. కాబట్టి నిరంతరం కొన్ని సంస్థలు ఈ పనిలో నిమగ్నమవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల బెడద దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్ నగరాన్ని స్వచ్ఛమైన నీరు లేని కరువు ప్రాంతంగా మార్చుతోంది. మిగతా ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపుతోంది. నాలుగు మిలియన్ ప్రజలతో కోస్తా స్వర్గం గా పేరొందే ఈ అత్యంత ఆదునిక ప్రధాన నగరం నీటివనరులు కరువై అల్లాడుతుండడం ప్రపంచం లోనే అరుదైన సంఘటన. . జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొని జీర్ణించుకోలేక అనారోగ్యం పాలవుతున్నాయి. ఫలితంగా వాటి మనుగడ దెబ్బతింటోంది. ఎండకు, సముద్రజలాలకు ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రభావితమై ఫోటో డిగ్రేడేషన్ ప్రక్రియకు గురవుతున్నాయి. ఫలితంగా హానికరమైన రసాయనాలు వెలువడుతున్నాయి. దానివల్ల సముద్ర జలాలు ఆమ్లీకరణమవుతున్నాయి.

సముద్ర పర్యావరణ వ్యవస్థ లోని ఆమ్ల ,క్షార సమతుల్యత తారుమారవుతోంది. దీనివల్ల పగడాల రెమ్మల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సముద్ర ప్రాణులకు ప్రమాదం కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువులు సాధారణంగా శిలాజ ఇంధనాల నుంచి తయారవుతుంటాయి. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి వీటిని తయారు చేస్తుంటారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ నుంచి విపరీతంగా కార్బన్‌డై యాక్నైడ్ ,మెథేన్ వెలువడి , వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ దిశగా రువాండా ప్రభుత్వం వేసిన అడుగు అందరికీ మార్గదర్శకం. 1999 లో భూటాన్ ప్లాస్టిక్‌ను నిషేధించగా, 2008 లో రువాండా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించింది. ఓషన్ క్లీనప్ అనే సంస్థ గ్రేట్ పసిఫిక్ గ్యార్బేజ్ పాచ్ క్లీనప్ అనే ప్రణాళికతో ప్లాస్టిక్ వ్యర్థాలను పసిఫిక్ సముద్రం నుంచి తొలగించే పనులను చేపట్టడం సత్ఫలితాలను ఇచ్చింది. దీనికోసం అత్యంత ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రం నుంచి వేరు చేస్తున్నారు.

సముద్ర జీవరాశులకు ముప్పులేకుండా చూస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, గ్రీన్‌పీస్, డబ్లుడబ్లుఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు చొరవ చూపిస్తున్నాయి. ఈ దిశగా భారత్ కూడా చెప్పుకోదగిన అత్యంత ఆధునిక విధానాలను అనుసరిస్తోంది. స్వచ్ఛ బారత్ అభియాన్ ద్వారా వ్యర్థాలను నిర్మూలించడం, వాటిని రీసైకిల్ చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్‌కు బదులు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం చేస్తోంది. 2019 సంవత్సర కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేవరకు అన్ని దశల్లో మొత్తం కోటి 25 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) అంచనా వేసింది.

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) 2022 గణాంకాలు పరిశీలిస్తే నగరంలో రోజూ 6400 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 73 శాతం తడి చెత్త లేదా ఆహార పదార్ధాల వ్యర్థాలు కాగా, మిగతా 27 శాతం అన్ని రకాల పొడి చెత్త ఉంటుంది. ఈ పొడి చెత్త ఏటా 6.3 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఇందులో 3.2 శాతం ప్లాస్టిక్. అయితే వీటిని తక్కువస్థాయిలో రీసైక్లింగ్ చేయడమే పెద్ద సమస్య.. గత ఏడాది కేవలం 47,000 టన్నుల పొడి వ్యర్థాలను మాత్రమే రీసైక్లింగ్ చేయగలిగారు. ఇందులో 12,402 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి.

దీని అర్థం ముంబై లోని ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగానికి సగం గుంతల్లో లేదా నేలలో పూడ్చివేతతో మిగిలిపోతోంది. చివరకు ఇవి నీటివనరుల్లో కలిసిపోతున్నాయి. ఢిల్లీ నగరంలో రోజూ 1100 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతానికి 78 శాతమే రీసైకిల్ చేయగలుగుతున్నామని ఢిల్లీ చెబుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి 100 శాతం రీసైక్లింగ్ చేయగలుగుతామని వెల్లడించింది. ఈ సమస్య దేశంలోని ప్రతి నగరం, పట్టణం లోనూ కనిపిస్తోంది. ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగం నిషేధించడానికి వీలైనన్ని విధానాలు రూపొందించాలి. దానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా శాస్త్రీయ దృష్టితో భవిష్యత్ ప్రగతి కోసం సహకరించాలి. అప్పుడే కొంతైనా సమస్య పరిష్కారమౌతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News