హైదరాబాద్ : శ్రీశైల మహాక్షేత్రంలో ప్లాస్టిక్, నాన్ ఓవెన్ కవర్ల వాడకం పూర్తిగా నిషేధించడానికి పలు చర్యలతో కూడిన ఆంక్షలు విధిస్తున్నట్లు దేవస్థానం ఈఓ పెద్దిరాజు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి క్షేత్ర పరిధిలో దేవస్థాన నిబంధనలు, ఆంక్షలను పాటింప జేసేలా సమర్థవంతమైన అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ ప్రతినిత్యం తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్రానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధం అమలు విషయమై ఇప్పటి వరకు వ్యాపారస్థులకు స్థానిక ప్రజలకు పలు అవగాహన సదస్సులు కూడా నిర్వహించినట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. అలాగే ప్రధాన కూడళ్లలోని హోటళ్లు, టీస్టాళ్ల వద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కిరాణ షాపుల్లో పార్శిల్ కవర్ల వాడకం నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్, రెవిన్యూ విభాగపు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, నాన్ ఓవెన్ కవర్ల నిషేధం అమలు విషయమై క్షేత్ర పరిధిలోని వర్తక వ్యాపార సంస్థల యజమానులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తామని, తద్వారా ఆయా నిబంధనలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానం నిర్ణయాలను నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొనున్నట్లు హెచ్చరించారు.
ప్రత్యామ్నాయ వనరులు కల్పించాలి : వ్యాపారులు
దైవక్షేత్రంలో ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులపై అవగాహన కల్పించి వాటి వాడకాన్ని అమలులోకి తెచ్చేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారులు కోరుతున్నారు. ప్రతినిత్యం స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే యాత్రికుల అవసరాల కోసం తప్పనిసరై ప్లాస్టిక్, నాన్ ఓవెన్ కవర్లను వాడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.