మనతెలంగాణ/ హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు తగిన పరిష్కారం చూపేందుకు యువశాస్త్ర వేత్తలు ముందుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా వానాకాలపు సీజన్లో సాగుచేస్తున్న వివిధ రకాల పంటలకు సంబంధించి వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలు అందచేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకుంటూ అన్ని రంగాల్లో కొత్తపుంతలు తొక్కుతున్నా సాగురంగంలో రైతాంగం ఇంకా వెనుకబడే వుంది. రైతులు సమస్యల వలయంలో చిక్కి సతమతమవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందించాలని ఉన్నప్పటికీ సరైన వేదిక, అవకాశం దొరక్క, సమయం సరిపోక చూస్తున్న వేలాది మంది వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, విశ్రాంత వ్యవసాయ అధికారులు కోసం వేదక సిద్ధం చేశారు. కేవలం రోజులో కొన్ని నిమిషాలపాటు వీరి సహాయంతో కొన్ని వేల మంది రైతులకు సహాయకారిగా ఉండేలా ఈ వేదికను రూపొందించారు. సీజన్ల వారీగా వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, భూసార పరీక్షలు, సేంద్రీయ ఎరువుల వినియోగం వాటి వల్ల కలిగే లాభాలు, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే మేలు రకం విత్తనాల ఎంపిక, నకిలీ నాసిరకం విత్తనాల పట్ల జాగ్రత్తలు,
పంటల సాగులో సస్యరక్షణ చర్యలు, పంటనూర్పిళ్లు, పంటల విక్రయానికి సంబంధించి మద్దతు ధరల సమాచారం, పంటల విక్రయానికి మార్కెట్ సదుపాయాలు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయరంగంలో రైతులకోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకుల ద్వారా పంట రుణాల సమాచారం, రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదితర సమాచారం రైతులకు అందచేయనున్నారు. అంతే కాకుండా పశుపోషన, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కూడా రైతులకు చేరవేయనున్నారు. నాపంట పేరుతో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా ఈ వానాకాల పంటల సీజన్‌నుంచే రైతులముంగిటకు మేరుగైన సలహాలు సూచనలతో ముందుకు రాబొతున్నట్టు వేదిక నిర్వాహకులు తెలిపారు.