డ్రెస్సింగ్ రూంలో ద్రవిడ్ స్పీచ్
కొలంబో: యంగిండియాలో తన అద్భుతమైన స్పీచ్లతో స్ఫూర్తి నింపుతున్నాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. మంగళవారం శ్రీలంకపై రెండో వన్డే గెలిచిన తర్వాత అతడు డ్రెస్సింగ్ రూమ్లో యువ క్రికెటర్లను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ వీడియోను బిసిసిఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో అసలు మ్యాచ్‌పై ఆశలు లేని స్థితి నుంచి దీపక్ చాహర్ ఫైట్‌తో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ పోరాట స్ఫూర్తినే ద్రవిడ్ తన ప్రసంగంలో ప్రస్తావించాడు. ఈ మ్యాచ్‌లో గెలవడం అద్భుతమని, ఒకవేళ ఓడిపోయినా తాను పెద్దగా పట్టించుకునే వాడిని కాదని ద్రవిడ్ అన్నాడు. ‘మనం ప్రతిఘటిస్తామని వాళ్లకు తెలుసు. మనం ప్రత్యర్థిని కూడా గౌరవించాలి. వాళ్లు సవాలు విసిరారు. దానికి ఓ చాంపియన్ టీమ్లా మనం రెస్పాండ్ అయ్యాం. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ద్రవిడ్ అన్నాడు. ఒకవేళ ఓడిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైట్ చేయడం అనేది ముఖ్యం. అది చేశారు బాగుంది అని యువ క్రికెటర్లపై ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు.