ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం భారత క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ఐపిఎల్ సందర్భంగా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో బిసిసిఐ ఇంగ్లండ్ సిరీస్‌లో అలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని భావిస్తోంది. క్రికెటర్లు వైరస్ పట్ల నిర్లక్షం వహించకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇంగ్లండ్ విమానం ఎక్కేముందు ఎవరికి పాజిటివ్ వచ్చినా ఇక సిరీస్ మొత్తానికి దూరమవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఆటగాడు క్వారంటైన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో నిర్లక్షం వహిస్తే సహించే ప్రసక్తే లేదని బోర్డు తేల్చి చెప్పింది. క్వారంటైన్ నిబంధనలు ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని, ఎవరూ కూడా దాన్ని ఉల్లంఘించకూడదని బిసిసిఐ సూచించింది. ఒకవేళ ఇంగ్లండ్ బయలుదేరే ముందు ఎవరికైనా కరోనా ఉన్నట్టు తేలితే వారిని అక్కడికి పంపించే ప్రసక్తే ఉండదని తెలిపింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ కోసం ఇటీవలే 24 మందితో కూడిన జంబో జట్టును భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. కాగా, ఇంగ్లండ్ బయలుదేరే ముందు క్రికెటర్లకు ముంబైలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు. అనంతరం క్రికెటర్లందరికి కరోనా పరీక్షలు నిర్వహించి ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు పంపిస్తారు. ఈ క్రమంలో ఎవరైనా కరోనా బారిన పడితే వారిని ఇంగ్లండ్ పర్యటన నుంచి తప్పిస్తారు.
players out of England tour if test positive: BCCI