Monday, December 23, 2024

రైతుల ఢిల్లీ మార్చ్..సరిహద్దుల మూసివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : రైతుల ఢిల్లీ ఛలో ఉద్యమం మంగళవారం సాగనున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులను హర్యానా ప్రభుత్వం మూసివేయడం, మొబైల్ ఇంటర్‌నెట్ సర్వీస్‌లను రద్దుచేయడం తదితర చర్యలను వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్‌హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైతుల ఆందోళనను అడ్డుకోడానికి హర్యానా, పంజాబ్, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను వెంటనే నిలుపు చేయించాలని , ఈమేరకు కోర్టు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ తన పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ విధంగా ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుగుతుందని భావిస్తున్నారు. హర్యానా లోని పంచకులకు చెందిన ఉదయ్ ప్రతాప్ సింగ్ హర్యానా, పంజాబ్ మధ్య సరిహద్దును మూసివేయడం చట్టవిరుద్ధమని విమర్శించారు.

రైతులు సమావేశం కావడాన్ని, శాంతియుతంగా ఆందోళన సాగించడాన్ని అడ్డుకోవాలనే లక్షంతో ముఖ్యంగా అంబాలా సమీపాన శంభూ వద్ద దారులు హర్యానా అధికార వర్గాలు సరిహద్దును మూసివేశారని ఆయన విమర్శించారు. అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా, ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీస్‌లు, ఎస్‌ఎంఎస్‌లను రద్దు చేశారని, ఈ విధంగా ప్రజల సమాచార హక్కును అణచివేశారని ధ్వజమెత్తారు. రోడ్డును దిగ్బంధం చేయడం స్థానిక ప్రజలకు అసౌకర్యం కలగడమే కాక, అంబులెన్సులు, స్కూల్‌బస్సులు, ఇతర వాహనాలు ముందుకు సాగలేక స్తంభించిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ విధమైన అడ్డంకి ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయిందని, దానివల్ల చాలా ఆలస్యం జరుగుతోందన్నారు. అడ్వకేట్లు, డాక్టర్లు, అత్యవసర సర్వీస్‌లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అంబాలా, కైథాల్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించడంతోపాటు రోడ్లపై సిమెంట్ బారికేడ్లు, ముళ్ల కంచెలు అడ్డుగా ఉంచడం, రైతుల అసమ్మతిని, ప్రజాస్వామ్య అభిప్రాయాన్ని అణగదొక్కడమేనని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News