Monday, December 23, 2024

పెళ్లైన పురుషులకు గృహహింస.. కాపాడాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాహితులైన పురుషులు గృహ హింసకు గురవుతున్నారని , ఫలితంగా వీరిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పురుషుల కోసం ఓ జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఈ పిటిషన్ కోరింది.

న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించిన సమాచారం ప్రకారం 2021లోప్రమాద వశాత్తు సంభవించిన మరణాలు 1,64,033 అని ఈ పిటిషన్ పేర్కొంది. వీరిలో 81,063 మంది పెళ్లయిన పురుషులని తెలియజేసింది. వివాహిత మహిళలు 28,680 మంది ప్రమాద వశాత్తు మరణించినట్టు ఈ నివేదిక పేర్కొన్నట్టు తెలిపింది. మరణించిన పురుషుల్లో 33.2 శాతం మంది మరణానికి కారణం కుటుంబ సమస్యలని , 4.8 శాతం మంది మరణానికి కారణం వివాహ సంబంధితమైనవని తెలియజేసింది.

2021లో 1,18,979 మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారని, 45,026 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సిఆర్‌బీ డేటా వెల్లడించిందని పేర్కొంది. గృహహింస బాధిత పురుషుల ఫిర్యాదులను స్వీకరించి , విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. గృహ హింస బాధిత పురుషుల సమస్యల పరిష్కారానికి తగిన చట్టం అమల్లోకి వచ్చే వరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించాలని కోరింది.

కుటుంబ సమస్యల ఒత్తిళ్లలో ఉన్నవారు, వివాహ సంబంధిత సమస్యలపై పురుషులు చేసే ఫిర్యాదులను కూడా పోలీసులు స్వీకరించాలని కోరింది. దీనికోసం తగిన ఆదేశాలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా పోలీస్ అధికారులు /స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు జారీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిటిషన్ కోరింది. ఈ ఫిర్యాదులు సరైన రీతిలో పరిష్కారమయ్యేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు నివేదించాలని కోరింది.

గృహ హింస లేదా కుటుంబ సమస్యలతో సతమతమయ్యే వివాహిత పురుషుల ఆత్మహత్యలపై పరిశోధన జరపాలని శాసన పరిశీలక సంఘంను ఆదేశించాలని కోరింది. జాతీయ పురుషుల కమిషన్ వంటి నివేదికను ఏర్పాటు చేసేందుకు తగిన నివేదికను సమర్పించాలని ఆదేశించాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News