Wednesday, January 22, 2025

నీట్ యుజి 2024 పరీక్ష రద్దు చేయాలి.. సుప్రీం కోర్టులో పిల్ దాఖలు

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి 2024 పరీక్ష రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఒక పిల్ దాఖలైంది. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలో ‘అక్రమాలు, వంచన’పై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించాలని, పేపర్ లీక్‌పై దర్యాప్తు ముగిసేంత వరకు కౌన్సెలింగ్‌పై స్టే ఇవ్వాలని పిల్ కోరింది. విద్యార్థుల ప్రయోజనం, సహాయం కోసం కృషి చేస్తున్న ఒక సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు పిల్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందన్న వార్త విద్యార్థులను బాధించిందని, ప్రతిభావంతులైన విద్యార్థులు పలువురు భావి వైద్యులు అయ్యే అవకాశాన్ని కోల్పోయారని పిల్ పేర్కొన్నది.

‘బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలనే ఏకైకధ్యేయంతో ప్రస్తుత పిటిషన్‌ను పిటిషనర్లు దాఖలు చేస్తున్నారు. ఆ విద్యార్థులు తమ కుటుంబ సభ్యుల మద్దతుతో నీట్ పరీక్ష 2024కు సన్నద్ధం కావడానికి తమ మొత్తం సమయం, కష్టపడి ఆర్జించిన డబ్బు, శక్తిని వెచ్చించారు. వారికి సమాన అవకాశాలు లేకుండా చేశారు’ అని పిల్ పేర్కొన్నది. నీట్ యుజి పరీక్ష ఫలితాల ప్రకటనపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. కాని ఇటువంటి వ్యవహారంలో ఎన్‌టిఎకు, ఇతరులకు కోర్టు నోటీస్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News