మా సమస్యలు పరిష్కరించండి
మన తెలంగాణ / హైదరాబాద్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమస్యల పరిష్కారం జీతాల పెంపుతో సానుకూల నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అందరిలాగే వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలను కూడా సానుకూల దృక్ఫథంతో, మానవీయ కోణంలో పరిష్కరించాలని కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి. వెంకట్రాములు, అధ్యక్షులు నర్సింహాచారి, ప్రధాన కార్యదర్శి ఎస్. రాములు, నాయకులు జి. వెంకటేశ్వరరావులు కోరారు.
రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌లో 147 మంది ఉద్యోగులు ఉండేవారని ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 58కి పడిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు 2010, 2015, 2020 పిఆర్‌సిలు ఇచ్చినా కార్పొరేషన్ ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ప్రస్తుతం 2005 పిఆర్‌సి ప్రకారం మాత్రమే తమకు జీతాలు అందుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ పిఆర్‌సిలు అమలు చేసి తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. పిఆర్‌సిల అమలు ఇప్పటికే ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని ఇంకా కాలయాపన జరుగకుండా చర్యలు తీసుకోవాలని వికలాంగ ఉద్యోగులకు ఆదుకోవాలని వేడుకున్నారు.