Thursday, January 16, 2025

తూతూ మంత్రంగా సర్వసభ్య సమావేశం

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది. మండల కేంద్రమైన లోకేశ్వరం ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల అధ్యక్షురాలు బాయమొల్ల లలితా భోజన్న అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో సమస్యలపై అధికారులను సభ్యులు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి 141 రోజుల పాటు శిబిరాల వద్ద అల్పాహారం భోజనం తదితర సౌకర్యాల నిర్వాహణకు మండలవ్యాప్తంగా సర్పంచ్‌లు వెచ్చించిన డబ్బులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి భుజంగ్ రావు సర్పంచ్ ముత్తాగౌడ్‌లు అధికారులను నిలదీశారు.

అందుకు సమాధానంగా ఇంచార్జి ఎంపిడివో సాల్మన్ రాజ్ 97 రోజులకు సంబంధించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయగా డబ్బులు ఎంపిడివో ఖాతాలో జమ అయ్యాయని సమాధానమివ్వగా ఖాతాలలో డబ్బులు ఎన్ని రోజులు జమవుంచుకుంటారని వచ్చిన డబ్బుల కొన్ని గ్రామపంచాయతీలకైనా విడుదల చేయాలని తెలిపారు. మిగితా నిధులు మంజూరైతే పంపిణీ చేస్తామని ఎంపిడివో చెప్పడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలం పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు డబ్బులు బ్యాంకు అకౌంట్ లలో వేస్తుందని వ్యవసాయ అధికారి గణేష తెలుపగా కోఆప్షన్ సభ్యుడు కళ్యాణ్ ప్రకాష్ లేచి మాట్లాడుతూ రైతుల ఖాతాలో రైతుబంద సాయం డబ్బులు జమ అయిన కొందరు బ్యాంకు అధికారులు పాత బకాయిలు చెల్లించలేదని బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారని దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించగా వ్యవసాయ అధికారి పై అధికారులకు సమచారం అందిస్తామని తెలిపారు.

అలాగే విద్యుత్ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని చరవాణిలో ఎన్నిసార్లు సంప్రదించినా సమాధానం ఇవ్వరని సర్పంచ్ ముత్తాగౌడ్ సభ ముందకు తీసుకెళ్లారు. ఇంతకుముందు నిర్వహించిన సమావేశలోనే ట్రాన్స్‌పార్మర్లు క్రమబద్దీకరించాలని చెప్పినా వారిలో ఎలాంటి స్పందన లేదని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని సబ్ స్టేషన్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్న ఏఈ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే మండల కేంద్రమైన లోకేశ్వరంలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వాటిని తీసివేయాలని చెప్పినా పట్టించుకోవడంలో విద్యుత్ శాఖ అధికారుల అంతర్యమేమిటని ప్రశ్నించారు.

చివరగా ఎంపిడివో మాట్లాడుతూ కుల వృత్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఒక లక్ష ఆర్థిక సాయానికి మండల వ్యాప్తంగా 864 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మెన్ రత్నాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఆయా శాఖల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News