నిండుకుండలా తలపిస్తున్న జంట జలాశయాలు
నగరంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా పెంపు
పర్యాటకులతో సందడిగా మారిన ప్రాజెక్టు పరిసరాలు
పూడికతీత పనులు చేపట్టాలంటున్న సమీప ప్రాంతాల ప్రజలు
హైదరాబాద్ : గ్రేటర్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల కురిసిన బారీ వర్షాలకు తాగునీరు జలాలందించే జంట జలశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. నిండుకుండల్లా తలపిస్తూ మరో రెండేళ్ల వరకు తాగునీటి జలాలు పుష్కలంగా లభిస్తాయని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. వరుసగా రెండేళ్లు కురిసిన వానలకు ప్రాజెక్టుల నీటి మట్ట స్దాయి పెరగడంతో జలాలను మూసీనదిలోకి వదిలారు. మొన్నటి వానలకు ఉస్మాన్‌సాగర్‌కు చెందిన రెండుగేట్లు, హిమాయత్‌సాగర్ ఐదు గేట్లు ఎత్తి దిగువకు వరదనీరు వదిలారు. దీంతో ప్రాజెక్టులకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ నీటి నిల్వలు సరిపడ ఉంచారు. ఇకా నుంచి ఉస్మాన్‌సాగర్ నుంచి 12 ఎంజిడీల నీటిని, హిమాయత్‌సాగర్ నుంచి మొన్నటివరకు 06 ఎంజిడిలు వదలగా, ఇకా నుంచి రోజుకు 10 ఎంజీడిల నీరు అదనంగా సరపరా చేస్తున్నట్లు వాటర్‌బోర్డు పేర్కొంటుంది.
ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌లో 1786 అడుగులుండగా, నిల్వ సామర్దం 3.008 టిఎంసీలు, హిమాయత్‌సాగర్ ప్రాజెక్టులో 1761.60 అడుగులు, నీటి నిల్వ సామర్దం 2.521 టిఎంసీలు ఉన్నాయి. ఇటీవలే ప్రభుత్వం గ్రేటర్ నగరంలో పాటు ఓఆర్ఆర్ గ్రామాలకు రోజు విడిచి రోజు సరఫరా చేస్తుండటంతో సరిపడ్డ జలాలు సరఫరా చేయడంపై అధికారులు మల్లగుల్లాలు పడ్డారు.కానీ మొన్న కురిసిన వానలకు జంట జలాశయాలతో పాటు కృష్ణా జలాలు కూడా పెరిగాయి,వీటితో జలమండలి ప్రజలకు సకాలంలో తాగునీరు సరఫరా చేస్తామంటున్నారు. అదే విధంగా స్దానిక ప్రజలు కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో పూడిక పెరుగుతుందని, వరద ఉదృత్తంగా ప్రవహించినప్పుడు మట్టి కొట్టుకరావడంతో ప్రతిఏటా అడుగులోతు మట్టి నిండితుందని, పూడికతీత పనులు చేపడితే మరో రెండు అడుగుల లోతు ప్రాజెక్టుల అడుగు భాగం పెరుగుతుందంటున్నారు.
అదే విధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతుంటడంతో సెల్లార్ తవ్వకాలు చేపట్టి మట్టి గుట్టలు,గుట్టలుగా చెరువులో పోయడం వరద నీటి జలాలు ఆశించిన స్దాయిలో నిల్వలు నిలవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక రోజు వర్షం కురిస్తే జలాలను దిగువ వదిలే పరిస్దితి ఏర్పడిందంటున్నారు. జలాశయాలకు మరమ్మత్తులు పనిచేపడితే ప్రాజెక్టులో మరో టిఎంసీ నీరు నిల్వలు ఉంచే సామర్దం పెరుగుతుందని స్దానిక జలమండలి డివిజన్ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలను పెరిగి బోరు పంపులో నీరు పుష్కలంగా దొరుకుతుందని, వచ్చే వేసవికాలంలో తాగునీటి సమస్యలు ఉండవని హర్షం వ్యక్తం చేస్తున్నారు.