కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని ఆహార తయారీ పరిశ్రమల రంగానికి(ఫుడ్ ప్రాసెసింగ్) రూ. 10,900 పెట్టుబడితో ఉత్పత్తితో ముడిపడిన రాయితీ(పిఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2.5 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు ఎగుమతుల పెంపునకు, వినియోగదారులకు మరిన్ని ఉత్పత్తులను అందచేసే ఈపథకానికి ఆమోదం తెలిపిందని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయుష్ గోయల్ విలేకరులకు తెలిపారు.
ఈ నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేయగలదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో 12-13 రంగాలకు పిఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. నేడు ఆహార తయారీ పరిశ్రమలకు పిఎల్‌ఐ పథకాన్ని క్యాబినెట్ ఆమోదించిందని ఆయన చెప్పారు.ఈ పథకం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రైతులకు వారి పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడగలదని ఆయన వివరించారు.