హైదరాబాద్‌లో ఫ్లగ్ అండ్ ప్లేటెక్ సెంటర్ కేంద్రం
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర రాజధానిలో ప్రపంచ అతిపెద్ద ఓపెన్ ఇన్నోవేషన్ ఫ్లాట్‌ఫారం
డిసెంబర్ మొదటివారంలో ప్రారంభిస్తామని మంత్రి కెటిఆర్‌కు తెలియజేసిన సంస్థ అధినేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ ప్లగ్ అండ్ ప్లేటెక్ సెంటర్ తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శనివారం సంస్థ యజమాన్యంతో సమావేశమైన తరువాత ఈ ప్రకటన వెలువడింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలను, ప్రొత్సాహకాలను సంస్థ ప్రతినిధులకు మంత్రి కెటిఆర్ వివరించారు. దీనిపై సంతృప్తి చెందిన సదరు సంస్థ యజమానులు హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి కెటిఆర్‌కు వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ప్లగ్ అండ్ ప్లేటెక్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని వారు మంత్రి కెటిఆర్‌కు హామి ఇచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫారం అయిన ‘ప్లగ్ అండ్ ప్లే‘ సంస్థ హైదరాబాద్ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించబోవడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. ‘ప్లగ్ అండ్ ప్లే రాక తెలంగాణలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌కు గొప్ప ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం మొబిలిటీ రంగంలో జెడ్ఎఫ్, ఫియర్, క్రిసెలర్,స్టెలంటిస్ వంటి సంస్థల భారీ పెట్టుబడులు తీసుకురావడంలో సఫలీకృతం అయ్యిందన్నారు. దీంతో పాటు అనేక ఒఎంఇ, టైర్..1సరఫరాదారుల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. మొబిలిటి రంగం అభివృద్ధికి ఇన్నోవేషన్ చాలా కీలకమైందని పేర్కొంటూ భారతదేశంలో మొదటి లొకేషన్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ప్లగ్ అండ్ ప్లే సంస్థ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్రెంచ్ ప్రభుత్వం, బిజినెస్ ఫ్రాన్స్ నిర్వహిస్తున్న ‘యాంబిషన్ ఇండియా‘ సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరిగింది.అతిపెద్ద ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్‌గా, ఆక్సిలేటర్గా, ప్రఖ్యాత కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ గా పేరొందిన ‘ప్లగ్ అండ్ ప్లే‘ నెట్‌వర్క్‌తో ప్లేబుక్‌తో పాటు 530కి పైగా అంతర్జాతీయ కార్పొరేషన్లు, 35,000 వెడెడ్ స్టార్టప్‌లు ఉన్నాయి. వాటితో పాటు వెంచర్ ఫండింగ్‌లో తొమ్మిది బిలియన్ల అమెరికన్ డాలర్లు సేకరించిన 1,500 యాక్టివ్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఈ సంస్థలో భాగంగా ఉన్నాయి . ప్లగ్ అండ్ ప్లే సంస్థకు సిలికాన్ వ్యాలీ (అమెరికా), స్టుట్గార్ట్ (జర్మనీ), పారిస్(ఫ్రాన్స్), ఒసాకా (జపాన్), షాంఘై (చైనా), వాలెన్సియా (స్పెయిన్), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) తో పాటు ప్రపంచవ్యాప్తంగా 37 కార్యాలయాలున్నాయి.
గూగుల్ పే, డ్రాప్ బాక్స్, లెండింగ్ క్లబ్, ఎన్26, సౌండ్‌హౌండ్, హని, కస్టమర్, గార్డెంట్ హెల్త్ వంటి కంపెనీల తొలి ఇన్వెస్టర్‌గా
‘ప్లగ్ అండ్ ప్లే‘ ఘనత వహించింది. 2020 సంవత్సరంలో 2,056 స్టార్టప్‌లను వేగవంతం చేసిన ప్లగ్ అండ్ ప్లే కంపెనీ అదే సంవత్సరంలో 162 వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టింది. ఇది మొబిలిటీ, ఎల్ఒటి, ఎనర్జీ, అగ్రిటెక్, హెల్త్, సస్టైనబిలిటీ, ట్రావెల్, ఫిన్‌టెక్ మొదలైన అనేక వర్టికల్స్‌పై దృష్టి పెడుతుంది.
ఈ నేపథ్యంలో మొదటి సారిగా భారతదేశంలో తన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ‘ప్లగ్ అండ్ ప్లే‘ హైదరాబాద్ లో మొబిలిటీ,
ఎల్ఒటి, ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్ రంగాల్లో పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. తదుపరి దశలో ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు విస్తరించనుంది. సీటెల్‌లో ఉన్న వెంచర్ ఫౌండ్రీ ట్రయాంగులమ్ ల్యాబ్స్, ఎల్ఒటి , స్మార్ట్ సిటీల కోసం ఇంక్యుబేషన్‌ను అమలు చేయడానికి హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్‌తో కలిసి పనిచేస్తుంది.
ఈ సందర్భంగా జర్మనీ, స్టార్టప్ ఆటోబాన్ ఎండి సస్చా కారింపౌర్ మాట్లాడుతూ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ కెటిఆర్ చూపిన ఉత్సాహాన్ని, చొరవను అభినందించారు. కెటిఆర్ అందించిన ప్రోత్సాహం సహాయంతో ప్లగ్ అండ్ ప్లే భారతదేశంలో అత్యంత విజయవంతమైన కొలాబరేషన్ ప్లాట్ ఫారం నిర్మిస్తుందన్నారు. రికార్డు సమయంలో నవీన సాంకేతిక సహకారానికి అంతర్జాతీయ కేంద్రంగా మారిన జర్మనీలోని స్టార్టప్ ఆటోబాన్లాగా హైదరాబాద్‌లోని ప్లగ్ అండ్ ప్లే టెక్ సెంటర్ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో ప్లగ్ అండ్ ప్లే సెంటర్‌ను మంత్రి కెటిఆర్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సిఇఒ సయీద్ అమీది సమక్షంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిక్యూటివ్‌లు ప్రకటించారు. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ఈ సమామేశంలో మంత్రి కెటిఆర్తోప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌తో సహా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం పాల్గొన్నది.