ప్రధాని మోడీపై టిఎంసి మండిపాటు
కోల్‌కత: పెరుగుతున్న ఇంధన ధరలను అదుపుచేయడం సాధ్యం కానందునే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై నిందలు మోపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. టిఎంసి ఎంపి సౌగత రాయ్ బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం జిఎస్‌టి బకాయిలను రాష్ట్రాలకు వెంటనే విడుదల చేయాలని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమను మానుకోవాలని కోరారు. కొవిడ్ సంక్షోభమే కాని మరే ఇతర సంక్షోభమైనా కాని పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైన ప్రతి సందర్భంలోను కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై నిందను తోసేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఇంధన ధరలను నియంత్రించడంలో కేంద్రం విఫలం చెందడంతో ప్రధాని మోడీ తప్పంతా రాష్ట్రాలదేనంటూ నిందిస్తున్నారని రాయ్ చెప్పారు. దేశంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితికి బాధ్యత వహించాల్సిన ప్రధాని తప్పును ఇతరులపై తోసేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంధనంపై ఎక్సయిజ్ సుంకాన్ని కొంత తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. బిజెపి రాజకీయ ప్రయోజనాలను వాడుకునేందుకు కొవిడ్ పరిస్థితిపైచర్చ పేరిట ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ప్రధాని నిర్వహించడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు.