Wednesday, January 22, 2025

బంగ్లాదేశ్ లోనే పొడవైన వంతెన ప్రారంభం

- Advertisement -
- Advertisement -

PM Hasina opens Bangladesh longest bridge

ఢాకా : బంగ్లాదేశ్‌లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పద్మా వంతెనను ప్రధాని షేక్ హసీనా శనివారం ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్ వంతెన దేశం లోనే అతిపొడవైన బ్రిడ్జి కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా, ప్రాంతీయ , అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అదే విధంగా దేశంలో వెనుకబడిన ప్రాంతాన్ని ఢాకాతోపాటు మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, స్టీల్, కాంక్రీట్ కలగలిపిన నిర్మాణం మాత్రమే కాదని, తమ శక్తి సామర్ధాలు, గౌరవానికి చిహ్నమని ప్రధాని షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ వంతెన అందుబాటు లోకి రావడంపై భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అభినందనలు తెలిపింది. 2015లో నిర్మాణం ప్రారంభమై 2022 జూన్ నాటికి పూర్తయిన ఈ వంతెన నిర్మాణ వ్యయం దాదాపు 3.6 బిలియన్ డాలర్లు అయింది.

అవినీతి ఆరోపణలతో ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి నిరాకరించగా, పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. మొత్తం 6.15 కిమీ పొడవైన ఈ వంతెనలో రైల్వే వయాడక్ట్ పొడవు 532 మీటర్లు కాగా, నాలుగు లేన్ల రోడ్డు వయాడక్ట్ పొడవు 3.14 కిమీ. వెనుకబడిన ప్రాంతమైన నైరుతి బంగ్లాదేశ్ లోని 19 జిల్లాలను, ఢాకాతోపాటు దేశం లోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. భారత్ లోని కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు సగం వరకు తగ్గిస్తుంది. చైనాకు చెందిన రైల్వే మేజర్ బ్రిడ్జ్ ఇంజినీరింగ్ గ్రూప్ ఈ బ్రిడ్జిని నిర్మించింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ వంతెనను నిర్మించినట్టు వార్తలు రాగా, బంగ్లాదేశ్ వాటిని కొట్టి పారేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News