Monday, December 23, 2024

ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మన విద్యావిధానం : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్ ఆవిష్కరణలకు ప్రయోగశాలగా మారిందని ప్రపంచ దేశాలు గుర్తించాయని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఇపి) ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. ప్రగతి మైదాన్‌లో శనివారం అఖిల భారతీయ శిక్షా సమాగం కార్యక్రమం ఏర్పాటైంది. యువత ప్రతిభను కాకుండా వారి భాషను బట్టి అంచనా వేయడం సరికాదని అన్నారు. భారత్‌లో తమ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని తెలిపారు.

తమ దేశాల్లో కూడా ఐఐటీ క్యాంపస్‌లను ప్రారంబించమని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ క్యాంపస్‌లను అబుదాబి, టాంజానియాలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. భారత్‌ను పరిశోధన ఆవిష్కరణలకు హబ్‌గా మార్చడమే జాతీయ విద్యావిధాన లక్షమని తెలిపారు. మన విద్యావిధానం సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థకు, భవిష్యత్తు సాంకేతికతకు సమాన ప్రాముఖ్యతను ఇచ్చిందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తు, ప్రతిస్పందన, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీలపై అవగాహన కల్పించాలని మోడీ కోరారు.

ఈసందర్భంగా 12 భాషల్లోకి అనువదించిన పాఠ్యాంశ పుస్తకాలతోపాటు పీఎంశ్రీ తొలివిడత నిధులను విడుదల చేశారు. సమగ్ర, వినూత్న బోధన విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం , అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు సమాన, నాణ్యమైన విద్య అందిస్తూ వారిలో సంపూర్ణ పరివర్తన తీసుకురావాలన్న లక్షంతో పీఎంశ్రీ పాఠశాలల ఏర్పాటుకు గతేడాది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News