Sunday, December 22, 2024

వచ్చే వారమే రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎంకిసాన్ పథకం 17 వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం వెల్లడించారు. మోడీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, గత హయాం లోనూ రైతుల ప్రయోజనాల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రం పైనే చేశారని చౌహాన్ తెలిపారు.

ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రూ. 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్టు పేర్కొన్నారు. ఈ పథకంలో అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూ. 2 వేలు చొప్పున ఏటా రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకంలో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. పీఎం కిసాన్ నిధుల విడుదలతోపాటు ‘కృషి సఖీ’ గా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ఈ నెల 18న ప్రధాని అందజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News