మనతెలంగాణ/హైదరాబాద్:ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ప్రతియేటా రైతులకు అందజేస్తున్న నిధులు రూ.6వేల నుంచి రూ.18వేలకు పెంచాలని తెలగాణ రాష్ట్ర రైతుసంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కార్పొరేట్ అనుకూల వ్యవసాయ సంస్కరణలపై పోరాటాలకు సన్నద్దం కావాలని రైతులకు పిలుపునిచ్చింది. ఈ నెల 5,6 తేదీల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న సెమినార్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం నాడు రైతుసంఘం కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా వ్యవసాయరంగం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదన్నారు. కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం సాధించాల్సి ఉందన్నారు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు.సూర్యాపేట సదస్సులో వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘం అఖిల భారత, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
పిఎం కిసాన్ పథకం రూ.18వేలకు పెంచాలి
- Advertisement -
- Advertisement -
- Advertisement -