ప్రధాని నరేంద్ర మోడీ సందర్శనను పురస్కరించుకుని కన్యాకుమారిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భద్రత కోసం 2,000 మంది పోలీసులు, వివిధ భద్రతా ఏజెన్సీలతో మోహరించనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేసేఉందకు ప్రాని మోడీ గురువారం కన్యాకుమారి రానున్నారు. 2019లో కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని మోడీ కేదార్‌నాథ్ గుహలో ధ్యానంలో కూర్చున్నారు. మే 30న లోక్‌సభ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అయిన సందర్భంగా ప్రధాని మోడీ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తారని బిజెపి నాయకులు తెలిపారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు ధ్యాన మండపం వద్ద 45 గంటల పాటు ధ్యానం చేస్తారని వారు తెలిపారు.
ప్రఖ్యాత హిందూ ధర్మ ప్రచారకుడు, సాధువు స్వామి వివేకానంద ఈ ధ్యాన మండపంలోనే భారత మాత గురించి తన దార్శనికతను పొందారని ప్రజలు విశ్వసిస్తారు. మోడీ కన్యాకుమారి సందర్శనను పురస్కరించుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. రాక్ మెమోరియల్, బోట్ జెట్టీ, హెలిప్యాడ్, ప్రభుత్వ అతిథి గృహం వద్ద భద్రతా ఏర్పాట్లను తిరునల్వేలి రేంజ్ డిఐజి ప్రవేష్ కుమార్, ఎస్‌పి ఇ సుందరవదనం బుధవారం పర్యవేక్షించారు. ప్రధానికి చెందిన ప్రత్యేక భద్రతా బృందం కూడా ధ్యాన మండపం చేరుకుని భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసింది. హెలికాప్టర్ ల్యాండింగ్ పరీక్షలను కూడా జరిపింది. అంతర్జాతీయ పర్యాటక పటంలో ఉన్న కన్యాకుమారి, చుట్టుపక్కల దాదాపు 2,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.