ఒక రాజకీయ నేత జయప్రదం కావడానికి కావలసిన లక్షణాలను ప్రధాని నరేంద్ర మోడీ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో వివరించారు. సంభాషణ శక్తి, అంకితభావం, ప్రజలతో అనుసంధానమై ఉండడం ఆవశ్యకమని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. ఒక లక్షం గల వ్యక్తులు కృతకృత్యులు అవుతారని, వ్యక్తిగత ఆకాంక్షలు గలవారు రాజకీయ రంగంలో విఫలం అవుతారని మోడీ అన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఒకరికి అవసరమైన ప్రతిభ గురించిన కామత్ ప్రశ్నకు మోడీ సమాధానం ఇస్తూ, ‘రాజకీయాల్లోకి ప్రవేశం సులభమే, కానీ విజయం సాధించడమనేది పూర్తిగా భిన్నమైన సవాల్’ అని పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో విజయం సాధించాలంటే పూర్తి అంకితభావం, మంచి కాలంలో, చెడు కాలంలో ప్రజలతో నిరంతరం మమేకమై ఉందాలి, ఒక జట్టు సభ్యునిగా పని చేసే సామర్థం ఉండాలి. ప్రతి ఒక్కరూ తాము చెప్పేది వింటారని, లేదా తమ వ్యవహరణ తీరును అనుసరిస్తారని ఎవరైనా భావిస్తుంటే వారు పొరబడినట్లే.
వారు కొన్ని ఎన్నికల్లో గెలవవచ్చు, కానీ వారు విజయవంతమైన నేతగా ఆవిర్భవిస్తారనే గ్యారంటీ లేదు’ అని ప్రధాని మోడీ తన పాడ్‌కాస్ట్ అరంగేట్రంలో చెప్పారు. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోని సవాళ్లు, స్వాతంత్య్రానంతర భారతంలో రాజకీయ రంగస్థలిలోని సవాళ్ల మధ్య ఆయన పోలిక తెచ్చారు. ‘భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో విభిన్న నేపథ్యాల వారు పాల్గొని, రకరకాలుగా సేవలు అందజేశారు. కొంత మంది జనానికి విద్యా బోధన చేశారు, ఇతరు ఖద్దరు నేతలో నిమగ్నమయ్యారు, అనేక మంది ఆదివాసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు. అయినప్పటికీ వారంతా దేశభక్తి స్ఫూర్తితో సంఘటితం అయ్యారు’ అని ప్రధాని మోడీ వివరించారు. ‘స్వాతంత్య్రం తరువాత ఆ వ్యక్తుల్లో కొందరు రాజకీయాల్లోకి ప్రవేశించి, సాటిలేని పరిణతిని, అంకితభావాన్ని, ప్రగాఢ లక్షాన్ని తమతో తీసుకువచ్చారు’ అని ఆయన పేర్కొన్నారు.
‘వ్యక్తిగత ఆకాంక్షలతో కాకుండా ఒక లక్షంతో రాజకీయాల్లోకి రావడం మంచి వ్యక్తులకు కీలకం’ అని ప్రధాని నొక్కిచెప్పారు. ‘ఉదాహరణకు మహాత్మా గాంధీని తీసుకోండి. ఆయన గొప్ప వక్త అయి ఉండకపోవచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వం, జనంతో అనుబంధం దేశాన్ని సంఘటితం చేసింది. గాంధీ ఎన్నడూ టోపీ ధరించలేదు, కానీ ‘గాంధీ టోపీ’ని ప్రపంచం గుర్తుంచుకుంటున్నది. అదే సిసలైన భావ వ్యక్తీకరణ, నాయకత్వ బలం’ అని మోడీ అన్నారు. మాటలతో ఆకట్లుకునే ‘వృత్తిగత రాజకీయ నేతలు’ స్వల్ప కాలం పనికివస్తారే కానీ చిరకాలం ఉండబోరని ప్రధాని అన్నారు. యువజనుల రాజకీయ ప్రవేశం గురించిన ప్రశ్నకు మోడీ సమాధానం ఇస్తూ, ‘దేశానికి సేవ చేయాలనే నిస్వార్థ కాంక్షగల లక్షలాది నిబద్ధులైన యువ రాజకీయ నాయకులు భారత్‌కు అవసరం’ అని ఉద్ఘాటించారు. ‘రాజకీయాలు ఇవ్వడం, పొందడం, చేయడం గురించి కాదు. అటువంటి దృక్పథం దీర్ఘ కాలం ఉపకరించదు’ అని కూడా మోడీ చెప్పారు,
మనిషిని మాత్రమే, దేవుడిని కాను, పొరపాట్లు జరుగుతుంటాయి
ప్రధాని నరేంద్ర మోడీ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఆధ్వర్యంలోని పీపుల్ బై డబ్లుటిఎఫ్’ సీరీస్‌తో పాడ్‌కాస్ట్ అరంగేట్రం చేస్తూ, పొరపాట్లు జరుగుతుంటాయని, వాటికి తాను అతీతుడిని ఏమీ కానని చెప్పారు. ‘పొరపాట్లు జరుగుతుంటాయి, నేనూ కొన్ని చేయవచ్చు. నేను కూడా మనిషినే. దేవుడిని కాను’ అని కామత్‌తో మోడీ అన్నారు. పాడ్‌కాస్ట్ ఆరంభంలో తన భాషా నైపుణ్య గురించి జెరోధా సహ వ్యవస్థాపకుడు తన భయాన్ని పంచుకుంటూ తనకు ‘సరిగ్గా రాని హిందీ’ గురించి హాస్యపూరితంగా ప్రస్తావించారు. ‘సార్! నా హిందీ బాగుండకపోతే నన్ను క్షమించండి. నేను దక్షిణాదివాడిని. నేను ఎక్కువగా బెంగళూరులో పెరిగాను. మా అమ్మగారి ఊరు వైసూరు. అక్కడ ప్రజలు చాలా వరకు కన్నడ భాష మాట్లాడతారు. మా తండ్రిది మంగళూరు సమీప ప్రాంతం.
నేను పాఠశాలలో హిందీ నేర్చుకున్నాను. నాకు ఆ భాషను అంత ధారాళంగా మాట్లాడలేను’ అని కామత్ ప్రధాని మోడీతోచెప్పారు. ఇందుకు ప్రధాని మోడీ భరోసాపూర్వకంగా స్పందిస్తూ, “హమ్ దోనో కీ ఐసే హీ చలేగీ’ (ఇదే విధంగా కలసి సాగిద్దాం). నేను మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను, ఒక విధమైన ఆందోళనతో ఉన్నాను. ఇది నాకు సంక్లిష్టమైన సంభాషణ. ఇది నా తొలి పాడ్‌కాస్ట్. మీ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు’ అని చెప్పారు. రెండు గంటల నిడివి గల ఈ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోడీ తన బాల్యం, విద్య, రాజకీయ ప్రవేశం, ఎదురుదెబ్బలు, ఒత్తిడిని అధిగమించడం, విధాన నిర్వహణ సహా అనేక జ్ఞాపకాలను పంచుకున్నారు. ‘మా కుటుంబ సభ్యుల దుస్తులు ఉతుకుతుండేవాడిని. ఆ కారణంగా సరస్సు వద్దకు వెళ్లేందుకు నన్ను అనుమతించేవారు’ అని ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాని మోడీ స్వయంగా ‘ఎక్స్’లో ఈ పాడ్‌కాస్ట్ ట్రెయిలర్‌ను పంచుకున్నారు. ‘మీ కోసం దీనిని సృష్టిస్తూ మేము ఆనందించినట్లుగానే మీరంతా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోడీ రాశారు.