న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఉగ్రదాడిని ఖండించారు. పహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ దారుణ దాడిలో కొందరు పిల్లలను కోల్పోయారు. కొందరు భర్తలను.. మరికొందరు తండ్రులను కోల్పోయారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెబుతాం.. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ హెచ్చరించారు.
కాగా, మంగళవారం పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పుల విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని ఖండిస్తూ.. భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయి. పాకిస్తానే ఈ దాడులకు కారణమని.. మరోసారి సర్జికల్ స్ట్రైక్ తో బుద్ది చెప్పాలని.. ఈ ఘటనపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.