Monday, December 23, 2024

ప్రధాని ‘పసుపు’ ప్రేమ!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ తనకు ప్రాణంతో సమానమనే రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఢిల్లీలో తమ సోదరుడు ఒకడున్నాడని, తమ భవిష్యత్తు గురించి , బాగు గురించి ఆలోచిస్తున్నాడని తెలంగాణ మహిళలకు తెలుసునంటూ వారి పట్ల ఆత్మీయత ప్రదర్శించారు. తెలంగాణకు గొప్ప వారసత్వం, సంస్కృతి, చేతికళల వైభవం వున్నాయని ఈ విషయాన్ని ప్రపంచమంతా గుర్తించిందని కూడా ప్రశంసించారు. మహబూబ్‌నగర్ సమీపంలో ఆదివారం నాడు నిర్వహించిన బిజెపి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును, ములుగులో సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్టు ప్రకటించారు. పసుపు బోర్డు కోసం సాగిన పోరాట చరిత్రను గమనించే వారికి ఆ డిమాండ్ ప్రధాని మోడీకి ఇంత కాలానికి గుర్తుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 60 వేల ఎకరాల్లో పసుపును పండిస్తున్నారు.

సరైన ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాబడి లేక కష్టాలపాలవుతున్నారు. ఈ కారణంగా నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ ప్రాంతంలో ఒకప్పుడు అత్యధిక విస్తీర్ణంలో పసుపును పండించిన రైతులు నెమ్మది నెమ్మదిగా దానికి దూరం కావడం ప్రారంభించారు. కష్టనష్టాల నుంచి బయట పడాలంటే పంట దిగుబడిని పెంచే నూతన పరిజ్ఞానం, మార్కెటింగ్ సౌకర్యాలు కలిగించే జాతీయ పసుపు బోర్డును సాధించుకోడమే ఏకైక మార్గమని 12 ఏళ్ళ క్రితం రైతులు బిజెపి నాయకుడు మురళీధర్ రావు వంటివారి సలహా మీద పోరాట పంథాలో తొలి అడుగులు వేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి అనే సీనియర్ రైతు పసుపు బోర్డు డిమాండ్‌తో పాదయాత్రలు నిర్వహించారు. బోర్డు వచ్చేంత వరకు పాద రక్షలు ధరించకూడదని 2011 నవంబర్ 4న దీక్షబూని ఇప్పటి వరకు కొనసాగించారు. బోర్డును నెలకొల్పనున్నట్టు మహబూబ్‌నగర్‌లో ఆదివారం నాడు ప్రధాని మోడీ ప్రకటించన తర్వాతనే ఆయన ఈ దీక్షను విరమించుకొన్నారు.

పసుపు బోర్డును తీసుకొచ్చి తీరుతాననే వాగ్దానం మీద గత లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి నుంచి బిజెపి తరపున ధర్మపురి అరవింద్ ఎన్నికయ్యారు. ఆయన తన హామీని ఎప్పటికీ నెరవేర్చలేకపోడంతో రైతులు ఆయన రాజీనామాను కూడా డిమాండ్ చేశారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన మార్గాన్ని అడ్డుకొన్నారు. అయినా ఈ విషయాలేమీ ప్రధాని దృష్టికి రాకపోడం తక్షణమే సానుకూలంగా స్పందించకపోడం ప్రపంచం కళ్ళారా చూసింది. అటువంటి ప్రజల భావోద్వేగంతో ముడిపడి వున్న పసుపు బోర్డును మంజూరు చేస్తున్నామంటూ ఇంత కాలానికి ప్రధాని మోడీ ఇక్కడికి వచ్చి ప్రకటించడమే ఆశ్చర్యం కలిగిస్తున్నది. కేవలం వచ్చే శాసన సభ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని మాత్రమే ప్రధాని పసుపు బోర్డును ప్రకటించారని అర్థమవుతున్నది. దేశ ప్రగతి కోరుకొనే దేశాధినేతలు చేయదగిన పని కాదిది. తొమ్మిదిన్నరేళ్ళుగా దేశాన్ని పాలిస్తున్న వారు పసుపు రైతుల ఆకాంక్షను ఇంతకు ముందెప్పుడో నెరవేర్చి వుండవలసింది.

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పన డిమాండ్ కమలనాథులకు ఇప్పుడే గుర్తు రావడం, అది కూడా బాటసారికి ముసలి పులి బంగారు కడియం చూపించిన రీతిలో భవిష్యత్తులో ఎప్పుడో అమలయ్యే విధంగా ఆ బిల్లును ఆమోదింప చేయడం కేవలం ఓటు వేట వ్యూహమేనని రుజువైపోయింది. బిజెపి పాలకులు తమ పాలనలో ప్రజల బాగును కాకుండా కార్పొరేట్ యాజమాన్యాల లాభాలను విపరీతంగా పెంచడంలో తలమునకలయ్యారు. అంబానీ, అదానీ వంటి గుత్త పారిశ్రామిక యజమానులను సంతృప్తి పరచడంలో ఆనందం పొందారు. ఎన్నికల ముందు ప్రజల అవసరం కలిగి వారిని బుజ్జగించక తప్పని స్థితిని గుర్తించారు. ప్రజాపాలకులుగా ప్రజల సేవలో తరించాలనే స్పృహ లేనివారిని ప్రజలు మళ్ళీ మళ్ళీ ఎలా గెలిపిస్తారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అగస్మాత్తుగా వచ్చి వారి పట్ల ప్రేమను కురిపించడం అసహజంగా వుంటుంది. ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటన అలానే వుంది.

కొన్నేళ్ళ నాడే ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రధాని మోడీ ఎన్నికల అవసరం కోసం మళ్ళీ ప్రకటించారనే విమర్శ గమనించదగినది. ఒక ఎన్నికకు తదుపరి ఎన్నికకు మధ్య పాలకులకు, ప్రజలకు వుండవలసిన సంబంధానికి పరీక్ష సాగుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారే మళ్ళీ ప్రజాభిమానాన్ని పొందగలుగుతారు. దక్షిణాదిలో తమ జెండా ఎగిరిన ఏకైక రాష్ట్రం కర్నాటకలో ఇటీవలే ఘోర పరాజయం పొందిన బిజెపి ప్రజల పట్ల అవకాశవాదాన్ని అనుసరించడం తమకు హితవైన పద్ధతి కాదని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News