న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయ చట్టాల నిలకడను ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక అధ్యక్షతన జరిగిన బిమ్స్టెక్ సదస్సులో బుధవారం వర్చువల్గా ప్రసంగించారు.‘ ప్రస్తుతం ఐరోపాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ సమయంలో ప్రాంతీయ సహకారానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ కూటమి సామర్ధాన్ని బలోపేతం చేయడం ముఖ్యం. మన ప్రాంతం ఆరోగ్య, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలిచేందుకు ఐక్యత, సహకారం అవసరం’ అని మోడీ వెల్లడించారు.
అలాగే ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం అంగీకారానికి రావాల్సిన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. బంగాళాఖాతం ప్రాంతం… అనుసంధానత, శ్రేయస్సు, భద్రతకు వారధిగా మారే సమయం ఆసన్నమైందని ప్రధాని అన్నారు. నెలరోజులకు పైగా రష్యా జరుపుతోన్న దురాక్రమణతో ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆ ఐరోపా ప్రాంతంలో ప్రాణనష్టం సంభవిస్తోంది. సుమారు కోటి మంది ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లినట్టు అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడింది. ఈ సమయంలో బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బిమ్స్టెక్ అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్ దేశాల కూటమి. ప్రపంచ జనాభాలో 21.7 శాతం ప్రజలు ఇక్కడే ఉన్నారు. ఈ దేశాల మొత్తం జిడిపి 3.8 ట్రిలియన్ డాలర్ల పైమాటే.