Wednesday, January 22, 2025

ఘర్షణలతో ప్రపంచ సమస్యలు మరింత జటిలం: పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పరస్పర ఘర్షణలతో ఎవరికి ప్రయోజనం ఉండదు, అమానుష ఉగ్రవాదం అనుచితం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జి 20 దేశాల 9వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు (పి20)నుద్ధేశించి ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఘర్షణలతో, ఉగ్రవాద చర్యలతో మనకు మనమే సమాధి కట్టుకున్నట్లు అవుతుందని ప్రస్తుతం సాగుతోన్న హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు కలబడటం , నెత్తురు చిందించుకునే సమయం కాదని, ఇది శాంతి , సహోదరత్వాన్ని చాటుకునే తరుణం అని స్పష్టం చేశారు. కలివిడితనంతో ఏదైనా సాధించవచ్చు. విభజిత ప్రపంచంవైపు దారితీసే ఘర్షణలతో మానవాళికి మరింత చేటు కల్గుతుంది. ప్రపంచం ముందున్న సవాళ్లు మరింత జటిలమవుతాయని హెచ్చరించారు. స్థానిక యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు అయిన రెండురోజుల lపి 20 సదస్సులో ప్రధాని నేరుగా ఏ ఘర్షణ విషయాన్ని ప్రస్తావించలేదు. ప్రపంచ స్థాయిలో పరస్పర విశ్వాసలోపం ఏర్పడటం ప్రమాదకరం, దీనిని నివారించుకోవల్సి ఉంది. విశ్వాససంక్షోభాన్ని తొలిగించుకుని, మానవ కేంద్రీకృత ధృక్ఫథంతో ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. ఘర్షణలు ఎందుకు జరిగినా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఏమి జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. ప్రపంచం ఘర్షణల నడుమ సంక్షుభితం అయితే దీని వల్ల ఎవరికి ప్రయోజనం? ఇటువంటి వాటితో గెలిచేదెవ్వరు?ఓడెదెవ్వరు? అని మోడీ ప్రశ్నించారు. పలు కారణాలతో మానవాళి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని పట్టించుకోకుండా పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే ఘర్షణలు అనుచితం అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం , శాంతియుత పురోగమనం కోసం పాటుపడాల్సిన సమయం ఇదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం పట్ల మరింతగా మనం కఠినంగా వ్యవహరిచాల్సి ఉందని తెలిపిన ప్రధాని ఈ సందర్భంగా రెండు దశాబ్దాల క్రితం 2001లో పార్లమెంట్ భవనపై జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు. సీమాంతర ఉగ్రవాదంతో దేశంలో వేలాది మంది బలి అయ్యారని, ఈ ఉగ్రవాద విధ్వంసానికి భారత్ బాధిత దేశం అయిందని తెలిపారు. కేవలం భారతదేశం ఒక్కటే కాదు , ప్రపంచం అంతా టెర్రరిజం నానా రకాలుగా కష్టనష్టాలను తెచ్చిపెట్టింది. పైగా పలు విధాలుగా ఉగ్రవాదం విస్తరించుకొంటోంది. అయినా ఇప్పటికీ ఉగ్రవాదం సంబంధిత విషయంపై ప్రపంచ స్థాయిలో సరైన నిర్వచనం లేదని, ఇక కట్టడి ఎంతవరకు సాధ్యమని ప్రధాని ప్రశ్నించారు. ఏది ఉగ్రవాదం, ఉగ్రవాదం ఏ రూపంలో ఉంటోంది? దీనికి ఏ విధంగా ఎక్కడి నుంచి ఏ స్థాయిలో ప్రోత్సాహం అందుతోంది? అనే పలు విషయాలపై ప్రపంచ దేశాల నడుమ సరైన ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. ఇంతవరకూ ఉగ్రవాద నిర్వచనం లేకపోవడం శోచనీయం అన్నారు.

ఈ దిశలో ఇప్పుడు ఉగ్రవాదం అణచివేతపై ఐరాస వంటి అంతర్జాతీయ వేదికలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. దీనిని మానవతకు శత్రువులైన ఉగ్రవాద సంస్థలు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నాయని తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఏ విధంగా మరింత నిర్మాణాత్మకం వ్యవహరిస్తే బాగుంటుందనేది మనం ఆలోచించుకోవల్సి ఉందని ప్రధాని పిలుపు నిచ్చారు. ఇప్పుడు ఇక్కడ జరిగే సమ్మిట్ కేవలం నామమాత్రపు సమావేశం కాదని ప్రపంచస్థాయి పార్లమెంటరీ విధానాల మహాకుంభమేళ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కోవడం కేవలం ప్రజా ప్రాతినిధ్య విధానంతో మరింత తేలిక అవుతుందన్నారు. ప్రభుత్వాలు మెజార్టీ సాధనతో ఏర్పడవచ్చు. అయితే దేశం పాలన సాగేది కేవలం ఏకాభిప్రాయసాధనతోనే అనేది తన విశ్వాసం అని ప్రధాని తెలిపారు. ఈ విశ్వం వైపు మన మంతా వసుధైక కుటుంబం అనే ధోరణితో ముందుకు సాగాల్సి ఉంది. ఒక భూమి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు అనేది ప్రధాన విషయం అన్నారు. అందరి ప్రాతినిధ్యంతోనే సవాళ్లను ఎదుర్కోవడం మరింత తేలిక అవుతుంది. ఈ ఉద్ధేశంతోనే భారతదేశం జి 20లో ఆఫ్రికన్ యూనియన్‌ను సభ్యదేశంగా తీసుకునేందుకు ప్రతిపాదించిందని వివరించారు. వచ్చే ఏడాది భారతదేశంలో 100 కోట్ల మందిఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ప్రజాస్వామిక ఎన్నికల ఘట్టం ఉంటుంది.

ఈ ఎన్నికల ప్రక్రియను తిలకించేందుకు పి 20 ప్రతినిధులు వచ్చే ఏడాది తిరిగి భారతదేశానికి రావచ్చునని ప్రధాని ఆహ్వానించారు. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో పలు కీలక మార్పులు జరిగాయని, ఇవిఎంల వాడకంతో ఓటింగ్ పారదర్శకత పెరిగిందని, ఎన్నికల యావత్తూ ప్రక్రియలో సమర్థత ఇనుమడించిందని తెలిపిన ప్రధాని మోడీ ఈ విధానం వల్ల కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి అంతా తేలిగ్గా జరుగుతోంది. గంటల వ్యవధిలోనే ప్రజలకు తాము ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఎవరనేది ఖరారు అవుతోందన్నారు. దేశంలో ఇప్పటికీ 17 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, 300 వరకూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ జరిగింది. ప్రపంచ స్థాయిలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ఎన్నికల ఘట్టం భారతదేశం సంతరించుకుని ఉన్న ప్రత్యేకత అన్నారు. 2019 ఎన్నికలలో తమ పార్టీ వరుసగా రెండోసారి గెలిచిందని తెలిపారు. ఇప్పుడు జరిగే ఈ పి20 స్పీకర్ల సదస్సుకు జి 20 దేశాలకు చెందిన పార్లమెంట్ స్పీకర్లు, కొన్ని ఆహ్వానిత దేశాల స్పీకర్లు హాజరవుతారు. తొలిసారిగా ఈ సదస్సు పాన్ ఆఫ్రికన్ పార్లమెంటరీ స్థాయిని సంతరించుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News