మహబూబ్ నగర్ : ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ లో ఆదివారం ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రజాగర్జన సభకు హాజరైన ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలకు ఎన్నో వరాలు ప్రకటించారు. తెలంగాణలో పసుపు బోర్డు, సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
కాగా, నా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు అని ప్రధాని తెలుగులో మాట్లాడారు. చాలా సార్లు నన్ను నా కుటుంబ సభ్యులు అని సంబోధించారు. ఈ క్రమంలో కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. పాలమూరు సభలో రాష్ట్రంలో పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారన్న ప్రధాని పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
అదే సమయంలో ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.900 కోట్లతో సమ్మక-సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అంటారు. ఈ సందర్భంగా పాలమూరు సభలో రాజకీయాల గురించి మాట్లాడతానని హింట్ ఇచ్చారు.
తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు మనం అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించాము. అభివృద్ధి రోడ్డు, రైలు కనెక్టివిటీతో ముడిపడి ఉంది. మహిళా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించామని తెలిపారు. పార్లమెంటులో నారీ శక్తి బిల్లును ఆమోదించాం. దేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రికి ముందే శక్తి పూజ ప్రారంభించాము. హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.