Sunday, January 19, 2025

సామాజిక న్యాయం పేరుతో బడుగులకు అన్యాయం

- Advertisement -
- Advertisement -

ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు న్యాయం జరగలేదు
సంఘ సంస్కర్తల కల సాఫల్యానికి కృషి చేస్తున్నా
అమ్రోహా ర్యాలీలో ప్రధాని మోడీ
ఇద్దరు యువరాజల జోడీకి ప్రజల తిరస్కరణ
రాహుల్, అఖిలేశ్ ద్వయంపై పరోక్ష విమర్శ

అమ్రోహా (యుపి) : పూర్వపు ప్రభుత్వాలు సామాజిక న్యాయం పేరుతో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలను మోసం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఆరోపించారు. సంఘ సంస్కర్తలు జ్యోతిబా ఫూలే, బిఆర్ అంబేద్కర్, చౌదరి చరణ్ సింగ్ కల సాఫల్యం దిశగా తాను కృషి చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ద్వయంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ‘యువరాజుల జోడీ’ని ప్రజలు తిరస్కరించారని అన్నారు.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ తరఫున ఇక్కడ ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ, ‘పూర్వపు ప్రభుత్వాలు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాలను మోసగించాయి’ అని ఆరోపించారు. ‘జ్యోతిబా ఫూలే, అంబేద్కర్, (మాజీ ప్రధాని) చౌదరి చరణ్ సింగ్ సామాజిక న్యాయం కల సాధించేందుకు మోడీ రేయింబవళ్లు పాటుపడుతున్నారు’ అని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో ఎనిమిది పశ్చిమ యుపి నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా అమ్రోహా ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. ఈ నెల 26న రెండవ దశ ఎన్నికల సందర్భంగా అమ్రోహాలో పోలింగ్ జరుగుతుంది.

రాహుల్, అఖిలేశ్ ద్వయాన్ని మోడీ పరోక్షంగా విమర్శిస్తూ, “దో హెహ్‌జాదే కీ జోడీ’ (ఇద్దరు యువరాజుల జోడీ’ చిత్రం షూటింగ్ సాగుతోంది. కాని వారి చిత్రం ఇప్పటికే తిరస్కరణకు గురైంది.‘ఉత్తర ప్రదేశ్ ప్రజల వోట్లు కోరుతూ ఆ ఇద్దరు బయటకు వెళ్లినప్పుడల్లా వారు ఆనువంశికత్వం, అవినీతి, బుజ్జగింపుల పర్వం సాగిస్తుంటారు. మన విశ్వాసంపై దాడికి ఏమాత్రం అవకాశం వచ్చినా వారు వదలరు’ అని ఆరోపించారు. అమ్రోహాలో కాంగ్రెస్ అభ్యర్థి దానిష్ అలీపై మోడీ తీవ్రంగా విరుచుకుపడుతూ, ‘భారత్ మాతా కీ జై’ అనడానికి ఆయనకు అభ్యంతరాలు ఉన్నాయని ఆక్షేపించారు. ‘భారత్ మాతా కీ జైని అంగీకరించని వ్యక్తి భారతీయ పార్లమెంట్‌లో మంచి వ్యక్తిలా కనిపిస్తారా? భారతీయ పార్లమెంట్‌లోకి అటువంటి వ్యక్తి ప్రవేశాన్ని అనుమతించాలా?’ అని మోడీ ర్యాలీలో ప్రజలను అడిగారు.

మోడీ ప్రతిపక్షాన్ని తూర్పారపడుతూ, ‘అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ఆహ్వానాన్ని ఎస్‌పి, కాంగ్రెస్ తిరస్కరించాయి. వోటు బ్యాంకుల కోసం తహతహలాడుతున్నవారం ఆ ఉత్సవానికి ఆహ్వానాన్ని తిరస్కరించారు’ అని ఆరోపించారు. ‘వారు ఆహ్వానం తిరస్కరణతోనే సంతృప్తి చెందలేదు. ఇంకా వారు రామ మందిరాన్ని, సనాతన ధర్మాన్ని దూషించారు. ఎస్‌పి తమ వోటు వ్యాంకు కోసం రామ భక్తులను ‘పఖండి’ (కపటులు) అని అభివర్ణిస్తుంటుంది. ఇండియా కూటమిలోని వారు సనాతన ధర్మాన్ని ద్వేషిస్తుంటారు’ అని ఆయన విమర్శించారు. అమ్రోహా నుంచి శ్రీకృష్ణుడు వెళ్లిన గుజరాత్‌లోని ద్వారకలో ప్రార్థనల నిమిత్తం తాను సముద్ర గర్భంలోకి వెళ్లినప్పుడు ‘సముద్రం కింద ప్రార్థన చేసేందుకు ఏమీ లేదని కాంగ్రెస్ యువరాజు అన్నారు.

వారు తమ వోటు బ్యాంకుల కోసం మన విశ్వాసాన్ని కాదంటున్నారు’ అని ప్రధాని మోడీ ఆరోపించారు. అఖిలేశ్ యాదవ్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను మోడీ విమర్శిస్తూ, ‘బీహార్‌లోని వారు తాము యదువంశీకులమని చెబుతుంటారు. ఉత్తర ప్రదేశ్‌లో యదువంశీయుడుగా ప్రయోజనాలు అందుకునే నేతను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. శ్రీకృష్ణుని అవమానించే పార్టీతో వారు ఎలా చేతులు కలుపుతారు? వారితో మీరు ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారు?’ అని అన్నారు.

మతపరమైన అల్లర్లకు వోటు బ్యాంకు రాజకీయాలు కారణమని మోడీ ఆరోపిస్తూ, ‘ఈ వోటు బ్యాంకు రాజకీయాలు పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను అల్లర్ల జ్వాలల్లో దగ్ధం చేశాయి. ఉత్తర ప్రదేశ్ ప్రజలు గూండా రాజ్ శకాన్ని ఎన్నటికీ మరవజాలరు. దాని కారణంగా జనం యుపి నుంచి వలస వెళ్లవలసి వచ్చింది. కానీ యోగీజీ (యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్) మీ భద్రత కోసం నేరస్థుల బెడద వదిలించారు. ఈ శక్తులు తిరిగి ఏవిధంగానూ బలం పుంజుకోకుండా మనం చూడాలి’ అనిఅన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News