Thursday, December 19, 2024

మొదటిసారి మోడీలో కలవరపాటు

- Advertisement -
- Advertisement -

‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్‌గఢ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఆయనలో ఏనాడూ ఆందోళన కనిపించలేదు. ప్రత్యర్థుల ఎత్తులను తనదైన శైలిలో చిత్తు చేస్తూ వస్తున్నారు. చివరకు సొంత పార్టీలో కూడా తన మాటకు ఎదురులేని విధంగా చేసుకున్నారు. భవిష్యత్‌లో తనను ప్రశ్నించే అవకాశం ఉందని అనుమానించిన వారిని సహితం పదవులకు దూరంగా నెట్టేశారు. ప్రభుత్వంలో, పార్టీలో కేవలం భజనపరులు మాత్రమే కీలకంగా వ్యవహరించేటట్లు చేసుకోగలిగారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలను, సామర్థ్యాన్ని తలకిందులు చేశాయి. మొన్నటి వరకు ప్రయోగించిన అస్త్రాలు ఎదురు తిరిగాయి.
హిందుత్వ సెంటిమెంట్‌తో కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రయోగించిన ‘హనుమాన్ చాలీసా’ మంత్రం హిందువులను బిజెపికి అనుకూలంగా సమీకరించలేకపోయినా 1989 తర్వాత మొదటిసారిగా ముస్లింలను కాంగ్రెస్‌కు సానుకూలంగా సమీకరించింది. అందుకనే పాత మైసూర్ ప్రాంతంలో ముస్లింల మద్దతుపై ఆధారపడిన జెడిఎస్ మట్టికరిచినట్లయింది. అందుకనే కర్ణాటక ఫలితాలు రానున్న ప్రమాదాలకు సూచికగా మారాయి. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఆ విధంగా ముస్లింలు కాంగ్రెస్ వెనుక చేరితే బిజెపికి ఆందోళన కలిగించే అంశం కాగలదు. మరోవంక, జూన్ 23న పాట్నాలో నితీశ్ కుమార్ సారథ్యంలో జరిగిన ప్రతిపక్ష భేటీ గురించి ముందెవ్వరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 17 పార్టీల ప్రతినిధులు హాజరై సుమారు 450 నియోజక వర్గాలలో బిజెపిని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు సంసిద్ధతను తెలపడం ఒక విధంగా బిజెపి నాయకత్వానికి డేంజర్ సిగ్నల్ పంపినట్లయింది.
ఈ రెండు పరిణామాల తర్వాత బిజెపి అగ్రనాయకత్వంలో కలవరం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు జోక్యం చేసుకొని ఈ విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని నడిపితే భవిష్యత్ శూన్యం అని హెచ్చరించేందుకు అవకాశం కలిగించింది. మంత్రివర్గంలో, పార్టీలో కీలక పదవులలో సామర్థ్యం గలవారు గాని లేదా కనీసం ప్రజలను ప్రభావితం చేయగలవారు గాని లేరు. కేవలం ‘నమ్మకస్థుల’ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు.
గతంలో యుపిఎ ప్రభుత్వం కూడా ఇదే విధంగా పని చేయడం తో ఇప్పుడు కాంగ్రెస్‌కు గుర్తింపు పొందిన ప్రతిపక్ష హోదా కూడా కరువైంది. కాంగ్రెస్ నుండి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. కేవలం మోడీ ఇమేజ్ మీదనే ఆధారపడతారా? ప్రజలను పట్టించుకోనివారు ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం ప్రజలకు దూరమవుతుంది… అంటూ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మొన్న ఈ మధ్య వరకు కాంగ్రెస్‌లో ఒక కుటుంబం వారో లేదా వారి సన్నిహితులో చెప్పిందే వేదంగా జరుగుతూ ఉండెడిది. అందుకనే హేమంత్ బిస్వా శర్మ, గులాం నబీ ఆజాద్‌లతో సహా అనేక మంది ప్రముకులు కనీసం తమ అభిప్రాయం చెప్పుకొనే అవకాశం కూడా లేకుండా పోయిందంటూ ఆ పార్టీని విడిచిపెడుతూ వచ్చారు.
ఇప్పుడు ఆ పార్టీలో పరిస్థితి కొంచెమైనా మారింది. రోజుల తరబడి కూర్చోబెట్టి మంతనాలు జరుపుతున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీల్డ్ కవర్‌లో పేరు పంపలేదు. రోజుల తరబడి సంబంధితులను కూర్చోబెట్టి, నచ్చచెప్పి చేశారు. చత్తీస్‌గఢ్‌లో తాజాగా ముఖ్యమంత్రి పదవి కోసం ఏర్పడిన జగడాన్ని పరిష్కరించారు. రాజస్థాన్‌లో అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం బిజెపిలో ఢిల్లీ నుండి ఆదేశాలు పంపడమే గాని స్థానిక నాయకులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. దాని దుష్ప్రభావాన్ని కర్ణాటకలో చూసాము. ప్రజలతో సంబంధం లేని నాయకులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ భజనపరులకు అవకాశం లేకపోతే అసలు నియామకాలు లేవన్నట్లుగా రెండు నెలలుగా కర్ణాటకలో ప్రతిపక్ష నేతను నిర్ణయించలేక పోతున్నారు. మణిపూర్‌లో బిజెపిని ఎన్నుకొంటే శాంతి అందిస్తామని గత ఏడాది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రధాని మోడీ రెండు నెలలుగా హింసాకాండ జరుగుతున్నా నోరు మెదపడం లేదు. హింసాకాండకు చైనా జోక్యం కారణం అంటూ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్రమైన ఆరోపణ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.చివరకు అమెరికా రాయబారి భారత ప్రభుత్వం అడిగితే తాము జోక్యం

చేసుకుంటానంటూ బహిరంగంగా ప్రకటన చేయడం కేవలం ప్రమాద ఘడియలను మాత్రమే వెల్లడి చేస్తున్నాయి. 2014లో బిజెపి అధ్యక్ష పదవి చేపట్టగానే ఇప్పటి వరకు బిజెపి అధికారంలోకి రాని కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల్లో అధికారం లక్ష్యంగా పని చేస్తానని అమిత్ షా ప్రకటించారు. ఆ మేరకు అసోంలో అధికారంలోకి రాగలిగారు. పశ్చిమ బెంగాల్‌లో అందుకు గట్టి ప్రయత్నం చేశారు. కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా చెప్పుకోదగిన విజయాలు సాధ్యం కాలేదు.
కర్ణాటకలో కేవలం స్వయంకృతాపరాధం కారణంగా అధికారం కోల్పోవలసి వచ్చింది. మంచి జోష్ వచ్చిన తెలంగాణలో పార్టీ నాయకత్వం కారణంగా ఇప్పుడు చతికిలబడే పరిస్థితి నెలకొంది. దేశంలో కొత్తగా ఎక్కడా లోక్‌సభ సీట్లను గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. పైగా, గత ఎన్నికలలో గెలుచుకున్న సీట్లలో 60 నుండి 80 సీట్ల వరకు కోల్పోవలసి రావచ్చని అంతర్గత సర్వేలు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బిజెపికి సొంతంగా మెజారిటీ రాని పక్షంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు ముందుకు రాకపోవచ్చు. అందుకనే ఈ భర్తీని నింపుకునేందుకు పార్టీ ప్రభావాన్ని ప్రజలలో విస్తరింప చేసే ప్రయత్నం చేయకుండా ప్రాంతీయ పార్టీలలో చీలికలు తీసుకు రావడం, ఎన్‌డియే నుండి వెళ్ళిపోయిన పక్షాలను తిరిగి చేర్చుకోవడం వంటి మార్గాలను అన్వేషిస్తున్నట్లు కనిపిస్తున్నది.మోడీ ఇమేజ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడే మహారాష్ట్రలో 2014 లో పూర్తి మెజారిటీ సాధ్యం కాలేదు. అందుకనే గత ఏడాది శివసేనను, తాజాగా ఎన్‌సిపిని నిట్టనిలువునా చీల్చారు. అయితే తద్వారా ఆ రెండు పార్టీల ఉనికిని ప్రశ్నార్ధకంగా చేసినా అంతర్గతంగా బిజెపి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్ధవ్ థాకరేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఇష్టం లేక 2019లో అధికారంలోకి రాలేకపోయింది. బిజెపికి ఇప్పుడు మహారాష్ట్రలో పూర్తిగా ఆ పదవికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పైగా, ఎంపి, ఎంఎల్‌ఎ సీట్లను పంచుకునేందుకు శివసేన (షిండే)తో పాటు ఎన్‌సిపి (అజిత్) కూడా జతకావడంతో నికరంగా బిజెపికి వచ్చే సీట్ల సంఖ్య తగ్గే పరిస్థితి నెలకొంది.

ఉద్ధవ్ థాకరేను అధికారానికి దూరం చేయడంతో చెంపదెబ్బ వంటి సమాధానం ఇచ్చినట్లయినా రాజకీయంగా బిజెపి సాధించింది కనబడటం లేదు.పైగా, 2014లో మోడీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ‘అవినీతికి వ్యతిరేక పోరాటం’ నేడు బిజెపిని జనం దృష్టిలో అవహేళనకు గురిచేస్తున్నది. కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా మారిన బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మొదటిసారిగా మోడీపై అవినీతి మరకలు చేరాయి. అయినా ఎన్నికల్లో ఫలితం లేకపోయింది. భోపాల్ సభలో ఎన్‌సిపిని అవినీతి పార్టీగా ప్రధాని నిందించిన రెండు రోజులకే ఆ పార్టీలో ఇడి కేసులు ఎదుర్కొంటున్న తొమ్మిది మందిని మహారాష్ట్రలో మంత్రులుగా చేర్చుకున్నారు. ‘దేశంలోని అవినీతిపరులారా.. చెవులు పెద్దవి చేసుకుని ఒక మాట వినండి. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే,అవినీతిపరుల పనిపట్టేందుకు నేను గ్యారెంటీ’ అంటూ చత్తీస్‌గఢ్‌లో మోడీ చేసిన ప్రకటనను ఇప్పుడు చివరకు బిజెపి శ్రేణులు సహితం సీరియస్‌గా తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు.

2014, 2019లలో కేంద్రంలో బిజెపికి సొంతంగా మెజారిటీ రావడంతో బిజెపిని అధికార పక్షంగా మార్చడంలో కీలక భూమి క వహించిన ఎన్‌డిఎను మూలన పడవేశారు. ఎన్‌డిఎ పక్షాలను అవసరాల మేరకు ఉపయోగించుకోడానికి మాత్రమే పరిమితమయ్యారు. దానితో సుదీర్ఘకాలం బిజెపితో కలిసి ప్రయాణం చేసిన శివసేన, అకాలీదళ్ వంటి పక్షాలు, మధ్యలో చేరిన టిడిపి వంటివి కూడా దూరమయ్యాయి. ఇప్పుడు ఎన్‌డిఎలో పట్టుమని పది మంది ఎంపిలున్న పక్షం అంటూ లేదు. 2019 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఎన్‌డిఎ సమావేశమే జరగలేదు. నితీశ్ కుమార్ బిజెపితో గతంలో సంబంధం తెంచుకున్న తర్వాత ఎన్‌డిఎ కన్వీనర్ అంటూ ఎవ్వరూ లేకుండానే కొనసాగుతున్నది.

అమిత్ షా బిజెపి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆయన ఒక విధంగా కన్వీనర్ వలే వ్యవహరించేవారు. ఇప్పుడు కూటమి ఒక రూపం తీసుకునే అవకాశాలు కనిపించడం, చివరకు కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్న ఆప్ సహితం అటువైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తుండడంతో ఇప్పుడు ఎన్‌డిఎ సమావేశం 18న జరుపుతున్నారు. అకాలీదళ్ వంటి పాత మిత్రులను తిరిగి దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బిజెపి మంత్రివర్గంలో, పార్టీలో తలపెట్టిన భారీ మార్పులు ఆ పార్టీలో నెలకొన్న ఆందోళనను మాత్రమే వెల్లడి చేస్తున్నాయి. ప్రజలకు సానుకూల సంకేతాలు ఇచ్చే ప్రయత్నంగా మాత్రం కనిపించడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News