న్యూఢిల్లీ: కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాడుతోందని, ఈ సంక్షోభ సమయంలో యోగా అనేది ఓ ఆశా కిరణంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘కరోనాపై పోరులో యోగాను కూడా డాక్టర్లు ఉపయోగిస్తున్నారు. కరోనా సమయంలో యోగా అనేది సురక్షా కవచం లాంటిది. ఓపిక అనేది యోగాలో ఓ భాగం. యోగాతో క్రమశిక్షణ అలవరుతుంది. ఏదైనా విజయం సాధించాలంటే మంచి ఆరోగ్యం కూడా అవసరం. యోగా ద్వారా రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. యోగా ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుంది. యోగాపై అనేక పరిశోదనలు జరిగాయి. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతున్నాయి. కరోనా సమయంలో యోగా పట్ల ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకు కూడా యోగా యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆయా ప్రాంతాల భాషలకు అనుగుణంగా యాప్‌లు వచ్చాయి. ‘వన్ వరల్డ్-వన్ హెల్త్’ సాధనకు ఇది ఉపయుక్తమవుతుంది’ అని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
PM Modi Addresses to Nation on Yoga day