- ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం కావాలి
- ప్రజల సౌభాగ్యానికి అది దోహదకారి
- మధ్య తరగతి జీవితాల్లో జోక్యం నాకు అయిష్టం
- ‘భారత్ టెక్స్’ సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ఎటువంటి సమాజం ఉండాలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం విస్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం సృష్టి తన లక్షమని ప్రధాని వెల్లడించారు. అది ప్రజల సౌభాగ్యానికి దోహదకారి అవుతుందని మోడీ సూచించారు. పేదల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉండాలని ప్రధాని అన్నారు. ‘ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజాన్ని మనం సృష్టించవలసి ఉంటుంది& ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలలో జోక్యాన్ని నేను ఇష్టపడను’ అని మోడీ చెప్పారు.
ఢిల్లీలో ‘భారత్ టెక్స్ 2024’ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, కనీస మాత్రపు ప్రభుత్వ జోక్యంతో సమాజం సృష్టికి గడచిన పది సంవత్సరాలుగా తాను పోరాడుతున్నానని, వచ్చే ఐదు సంవత్సరాలలో అదే విధంగా చేస్తుంటానని తెలిపారు. దేశంలో సౌభాగ్య కోసం ప్రభుత్వం దోహదపడే ఏజెంట్‌గా వ్యవహరించాలని ఆయన నొక్కిచెప్పారు. ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోవడమనే ప్రభుత్వ అలవాటును తప్పించడానికి గత పది సంవత్సరాలుగా తాను పోరాడుతున్నానని, ‘రానున్న ఐదు సంవత్సరాలలో కచ్చితంగా అదే పని చేస్తాను’ అని ఆయన చెప్పారు. దేశంలో అతి పెద్ద ప్రపంచ జౌళి సదస్సులలో ఒకటి భారత్ టెక్స్ 2024.