Thursday, January 23, 2025

ద్వంద్వ వైఖరి!

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ పాలస్తీనా మారణకాండపై భారత వైఖరిలో స్పష్టత లోపించడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో? ఈ నెల 7న హమాస్ ఇజ్రాయెల్‌పై వేలాది రాకెట్లతో, దళాలతో భీషణ దాడి చేసిన వెంటనే ప్రధాని మోడీ దానిని టెర్రరిస్టు ముష్కరతంగా పరిగణించి ఖండించారు. ఆ తర్వాత ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. అప్పుడు కూడా ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతును తెలియజేశారు. టెర్రరిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనతో అన్నారు. హమాస్ దాడిలో వందలాది మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలు కావడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది. అయితే ప్రధాని మోడీ స్పందనకు అదొక్కటే కారణమని అనుకోలేము. ఎందుకంటే ఆయన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకొని వున్నారు. హమాస్ చర్య కూడా ఆయనకు అలా అనిపించి వుండ వచ్చు. కాని పాలస్తీనా వ్యవహారం పూర్తిగా భిన్నమైనది. అందుచేత ప్రధాని మోడీ ఆ చారిత్రిక నేపథ్యంలోకి వెళ్ళకుండా హమాస్ దాడిని తీవ్రవాద దాడిగా పరిగణించి ఖండించడం, ఇజ్రాయెల్‌కు అండగా వుంటామని ప్రకటించడం పాలస్తీనాపై భారత దేశ వైఖరిలోనే సమూలమైన మార్పు వచ్చిందనే అభిప్రాయానికి అవకాశమిచ్చాయి.

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా తన పూర్వపు అలీన విధానానికి స్వస్తి చెప్పింది. అయితే మొన్న గురువారం నాడు మన విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ఒక ప్రకటన చేస్తూ స్వతంత్ర, సర్వసత్తాక, దృఢమైన పాలస్తీనా ఆవిర్భావం కోసం నేరుగా చర్చలు జరగాలని ఇండియా ఎల్లప్పుడూ చెబుతున్నదని ఇప్పుడు కూడా తమ విధానం అదేనని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఒక మాదిరిగాను, ఆయన ప్రభుత్వ విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగానూ వ్యక్తం కావడమే ఆశ్చర్యకరమైన పరిణామం. మోడీ ఇజ్రాయెల్‌కు మద్దతు తెలపడం అరబ్ దేశాల్లో అసంతృప్తిని కలిగించే అవకాశాలున్నాయి. అది మనకు హానికర పరిణామాలకు దారి తీస్తుంది. మనం దిగుమతి చేసుకొంటున్న క్రూడాయిల్‌లో ఎక్కువ భాగం ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే వస్తున్నది. రష్యా నుంచి తెచ్చుకొంటున్న క్రూడాయిల్ వల్ల అరబ్ దేశాల మీద ఆధారపడ్డం పూర్తిగా తొలగిపోయే అవకాశాలు లేవు. పాలస్తీనాతో భారత దేశ సంబంధాలు ఈనాటివి కావు. పాలస్తీనాను అక్కడి ప్రజల న్యాయమైన ప్రతినిధిగా 1974లో గుర్తించిన మొట్టమొదటి అరబ్‌యేతర దేశం ఇండియా. అలాగే పాలస్తీనాను పూర్తి స్థాయి దేశంగా 1988లో భారత్ గుర్తించింది. ప్రధాని మోడీ ప్రభుత్వంలో కూడా ఈ పరిస్థితి కొనసాగింది. 2016లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాలస్తీనాను సందర్శించారు.

2017లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ భారత పర్యటనకు వచ్చారు. అబ్బాస్ ఇప్పుడు వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా భూభాగం అధ్యక్షుడుగా పరిమితమయ్యారు. ఇజ్రాయెల్ ధ్వంస ధూళి చేస్తున్న గాజా ప్రాంతం హమాస్ ఆధీనంలో వుంది. పశ్చిమాసియా సమస్య పరిష్కారం కావాలంటే పాలస్తీనా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని మాజీ ప్రధాని వాయ్‌పేయీ 1977లోనే ప్రకటించారు. ప్రధాని మోడీ ఇప్పుడు తీసుకొన్న వైఖరి ఇందుకు పూర్తి విరుద్ధమైనది. మోడీ పాలనలో ఇండియా, ఇజ్రాయెల్‌లు బాగా దగ్గరైన మాట వాస్తవమేగాని పాలస్తీనా విషయంలో మన పూర్వపు వైఖరికి పూర్తిగా స్వస్తి చెప్పినట్టు అనిపించడం మాత్రం ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ప్రధాని మోడీ నాలుక కరచుకొని విదేశాంగ శాఖ చేత పూర్వపు విధానాన్ని పునరుద్ఘాటింప చేశారా? అనే అనుమానం కలగడం సహజం. విదేశాంగ విధానంలో మోడీ ప్రభుత్వ పరస్పర విరుద్ధ ధోరణులు ఇంతకు ముందెప్పుడూ ఇంత స్పష్టంగా బయటపడలేదు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా అడుగు జాడల్లో అడుగు వేయకుండా రష్యాతో సత్సంబంధాలను కాపాడుకొంటూ దాని నుంచి ఆయిల్‌ను కూడా చవకగా తెచ్చుకోగలుగుతున్నందుకు మన విధానం ప్రశంసలను పొందింది.

ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో ఈ తొందరపాటు ఎందుకు అనే ప్రశ్న తలెత్తుతుంది. గాజాలో ఇజ్రాయెల్ సేనల ప్రతీకార దాడులను, అక్కడ అవి సాగిస్తున్న మారణ కాండను అరబ్ ప్రపంచమంతా ఖండిస్తున్నది. ఆయా దేశాల్లో నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దాడుల నుంచి కాపాడుకోడానికి పారిపోతున్న పాలస్తీనియన్లకు ఈజిప్టు ఆశ్రయమిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం అది తన సరిహద్దులను తెరిచి వుంచినట్టు వార్తలు చెబుతున్నాయి. ఇటీవలి వరకు ఇజ్రాయెల్‌తో ఒప్పందాలకు సిద్ధపడిన అరబ్ దేశాలు ముందు ముందు తమ వైఖరి మార్చుకోవచ్చు. అటువంటి నేపథ్యంలో భారత దేశం ఇరుకున పడే ప్రమాదం కనిపిస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News