ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన శుక్రవారం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో రెండు గంటటకు పైగా నిలచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో ప్రధాని మోడీ మరొక విమానంలో దేవ్‌గఢ్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రధాని విమానంలో సాంకేతిక లోపాన్ని సరిచేయలేక పోయినట్లు, రెండు గంటలకు పైగా ఆలస్యం అనంతరం ఆయన మరొక విమానంలో ఢిల్లీ వెళ్లినట్లు దేవ్‌గఢ్ జిల్లా కలెక్టర్ తెలియజేశారు. దేవ్‌గఢ్‌కు సుమారు 80 కిలో మీటర్ల దూరంలోని బీహార్ జముయిలో ఒక ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మోడీ భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విమానంలో న్యూఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లవలసి ఉందని అధికారులు తెలిపారు.
బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమం కోసం మోడీ జముయి సందర్శించారు. బిర్సా ముండా జయంతిని ‘జన్‌జాతీయ గౌరవ్ దివస్’గా పాటించారు. ‘ప్రధాని ఒక గంటపైగా దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఉండిపోయారు. ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నాం’ అని అధికారి ఒకరు తెలియజేశారు. ఈ స్తంభన ఫలితంగా ఈ ప్రాంతం గగన తలాన్ని ‘విమాన ప్రయాణ నిషిద్ధ మండలం’గా ప్రకటించడమైంది. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా గోడ్డాలో చిక్కుకుపోయారని, ఆయన ప్రయాణించవలసిన హెలికాప్టర్ ఈ కారణంగా బయలుదేరలేదని అధికారులు తెలిపారు. రాహుల్ గోడ్డాలో ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. అయితే. అధికార యంత్రాంగం రాహుల్ గాంధీని అన్యాయంగా లక్షం చేసుకుందని కాంగ్రెస్ ఆరోపించింది.
‘మా నేత రాహుల్ గాంధీని దాదాపు రెండు గంటల పాటు బయలుదేరనివ్వలేదు. దీనితో ఆయన ప్రాణానికి తీవ్ర ముప్పు ఏర్పడింది. కేంద్రం ప్రేరణతో చోటు చేసుకున్న భద్రత లోపం ఇది’ అని ఝార్ఖండ్ మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోపించారు.